Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పరిపాలనా విభాగంలో ప్రమోషన్ల రచ్చ నడుస్తూనే ఉంది. ప్రసాదరావు కమిటీ, ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా నాలుగో తరగతి నుంచి రికార్డు అసిస్టెంట్ ప్రమోషన్ల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 100 పోస్టులకు గాను 76 మందికి ప్రమోషన్లు ఇచ్చిన అధికారులు అర్హులను పక్కనపెట్టేశారు. అయితే ఇప్పటికే ప్రమోషన్లు పొందిన మాత్రం తమకు పదోన్నతి వద్దని నాట్ విల్లింగ్ లెటర్లు అందజేశారు. చార్మినార్ జోన్లో 11, కూకట్పల్లి జోన్లో ముగ్గురు, హెడ్ ఆఫీసులో ఒకరు ప్రమోషన్లపై అనాసక్తిగా ఉన్నారు.
మరో 15 మంది ఉద్యోగులు నాట్ విల్లింగ్ లెటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోషన్లు పొందినవారు జాయిన్ కావాలని ఒక పక్క జోనల్ కమిషనర్లు అడుగుతుంటే మరోపక్క తమకు అవసరంలేదని చెప్పడం గమనార్హం.
ఏసీఏపై కమిషనర్ సీరియస్?
జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(పరిపాలన)పై కమిషనర్ లోకేశ్ కుమార్ సీరియస్ అయినట్టు తెలిసింది. పరిపాలన విభాగంలో అవినీతి అధికారులను వెంటనే పంపించాలని, అలాంటి వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ విభాగం నుంచి సదరు వ్యక్తులను పంపించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.