Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
భవన నిర్మాణ అనుమతులు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్, ఇతర అంశాల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్సొరేషన్(జీహెచ్ఎంసీ) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే భవన నిర్మాణ అనుమతులకు 'క్యూ ఆర్ కోడ్' ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్‌బీపాస్) నవంబర్ 2021 నుంచి అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి ఇచ్చిన అనుమతులకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. అయితే 75 చదరపు గజాల ప్లాట్‌కు ఎలాంటి భవన నిర్మాణ అనుమతి అక్కర్లేదు. ఒక్క రూపాయితో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. రెసిడెన్షియల్ అయితే గ్రౌండ్‌తోపాటు జీ+1 వరకు నిర్మించుకోవడానికి అవకాశముంది. అయితే ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ మాత్రం తీసుకోవాల్సిందే. 500 చదరపు మీటర్ల వరకు (600 చదరపు గజాలు) రెసిడెన్షియల్ కేటగిరిలో 10మీటర్ల ఎత్తు వరకు ఆన్లైన్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా ఇన్స్టంట్ అప్రూవల్ ఇస్తున్న విషయం తెలిసిందే.
నకిలీలకు చెక్ : నకిలీ భవన నిర్మాణ అనుమతులకు చెక్‌పెట్టేందుకు జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించింది. 75 చదరపు గజాల స్థలం నంచి మొదలుకుని అపార్ట్మెంట్స్, మాల్స్, మల్టీస్టోర్డ్ బిల్డింగ్స్ వరకు క్యూఆర్ కోడ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఫలితంగా నకిలీ భవన నిర్మాణ అనుమతులను అరికట్టనున్నారు. దాంతోపాటు నిర్మాణ అనుమతి పురోగతిని తెలుసుకోవడం, బ్యాంకు రుణం విషయంలోనూ సులభతరమవు తుందని అధికారులు చెబుతు న్నారు. బ్యాంకు అధికారులు స్కాన్ చేస్తే ఎర్రర్ అనివస్తే నకిలీ అనుమతిగా పరిగణించ నున్నారు. సంబంధిత టౌన్ప్లా నింగ్ అధికారులు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్ లెటర్‌లోనే క్యూఆర్ కోడ్ ఉంటుంది.
ఇప్పటివరకు 13,668 అనుమతులు : టీఎస్ బీపాస్‌ను నవంబర్ 2021 నుంచి అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి 13,668 భవనాలకు నిర్మాణ అనుమతులు ఇచ్చారు. వీటిలో ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్లు (75చదరపు గజాలలోపు స్థలం) 2,547 ఉన్నాయి. 75 చదరపు గజాల నుంచి 600చదరపు గజాల(500చదరపు మీటర్లు) వరకు అప్రూవల్ దరఖాస్తులు 11,221లకు అనుమతులిచ్చారు. వీటితోపాటు 761భవనాలకు ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లు జారీచేశారు. మరో 572 దరఖాస్తులు పురోగతిలో ఉన్నాయి. అయితే దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అధికారులు తనిఖీ చేసిన అప్రూవల్ ఇస్తున్నారు. 15రోజుల తర్వాత కూడా వెరిఫికేషన్ చేయకపోతే సదరు అధికారికి పెనాల్టీ వేయాలని చట్టంలో ఉంది. దీని ప్రకారం ముగ్గురు అధికారులకు జీహెచ్ఎంసీ పెనాల్టీ వేసింది.
ఛేజింగ్ సెల్ ద్వారా.. భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను పర్యవేక్షించడానికి జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఛేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేశామని, సంబంధిత అధికారులకు ఈ సెల్ ఎప్పటికప్పుడు గుర్తుచేస్తోందని చీఫ్ సిటీప్లానర్ (సీసీపీ) ఎస్.దేవేందర్‌రెడ్డి తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో జీహెచ్ఎంసీ, బిల్డర్లు, నగరవాసులకు సులభతరమవుతుందని అన్నారు. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా నిబంధనల ప్రకారం నిర్మాణం చేపడితే 33శాతం పెనాల్టీతో అనుమతి ఇవ్వనున్నామ, చిన్నపాటి ఉల్లంఘన ఉన్నా అనుమతి ఇవ్వబడదని చెప్పారు.