Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/ఉప్పల్
బతికున్న మహిళ మృతి చెందినట్టు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటిజాగ కాజేసిన కి'లేడీ'లను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉప్పల్ సీఐ గోవిద్రెడ్డితో కలిసి రాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల మేరకు రామంతాపూర్ చర్చి కాలనీకి చెందిన పసల జ్యోతి పక్కనే ఉన్న కాళీ స్థలంపై కన్నేసింది. క్తొపేట్, రామకృష్ణాపురంలో నివాసముంటున్న పచ్చిపులుసు వరలక్ష్మి కుమారి చర్చి కాలనీలోని 74, 75 సర్వే నెంబర్లోని 276 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ప్లాట్‌ను 1983లో కొనుగోలు చేసింది. రామంతపూర్ శ్రీ రామన్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుండి ప్లాట్ కొనుగోలు చేసిన తర్వాత ఆమె కాంపౌండ్ వాల్‌ను నిర్మించింది. అయితే వృద్ధురాలు కొత్తపేట్‌లో ఉండటంతో నాలుగేండ్ల నుంచి చర్చి కాలనీకి రాలేదు. దాంతో ప్లాట్‌ను కాజేయ్యాలని పసల జ్యోతి పథం వేసింది. సిద్దిపేట్ జిల్లా బయ్యారం గ్రామపంచాయితీలో కొందరితో చేతులు కలిపింది. అందరూ కలిసి వరలక్ష్మి కుమారి (71) 2014, ఆగస్టు 5న మృతి చెందినట్టుగా డెత్ సర్టిఫికెట్‌ను సృష్టించారు. ఫోర్జరీ సంతకాలతో తానే వారసురాలుగా జ్యోతి పత్రాలు సృష్టించింది. ఆధార్‌ను మార్చేశారు. పథకంలో భాగంగా పసల జ్యోతి కుమార్తె పసల వెన్నెలకు గిఫ్ట్డీడీ చేసింది. ఎవరికి అనుమానం రాకుండా చిలుకానగర్‌లో నివాసముంటున్న బల్లా జ్యోతి పేరుమీదకు మార్చారు. ఇదిలా వుండగా అస్సలు ఓనర్ వరలక్ష్మికుమారి గత డిసెంబర్ 3న ప్లాట్‌ను చూసుకునేందు చర్చికాలనీకి వచ్చింది. దాంతో ఆందోళనకు గురైన జ్యోతి వరలక్ష్మిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో బాధితురాలు వరలక్ష్మి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో విచారించి పసల జ్యోతితోపాటు అమె కుమార్తె పసల వెన్నెల, బిల్లా జ్యోతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు కేవలం 20 రోజుల్లోనే అన్ని తప్పుడు పత్రాలను సృష్టించారని సీఐ తెలిపారు. భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ మహేష్‌భగవత్ హెచ్చరించారు. ఛాకచక్యంగా కేసును ఛేదించినందుకు సీఐని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.