Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ (బి.బి.జి) వ్యవస్థాపక అధ్యక్షులు టి.ఎస్.వి.ప్రసాద్ బషీర్ బాగ్ లోని బాబూఖాన్ ఎస్టేట్‌లో ఆదివారం నిరుపేదలు, కార్మికులకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆఫ్రికాలోని ఎత్తయిన కిలిమంజారో పర్వతం అధిరోహించిన అతి పిన్న వయస్కుడు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన 3వ తరగతి విద్యార్థి తేలుకుంట విరాట్ చంద్రను శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ అనేది హైదరాబాద్ నగరంలో పని చేస్తున్న విశ్రాంతి బ్యాంకు ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడ్డ సేవా సంస్థ అని అన్నారు. ఈ సంస్థలో వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ రంగం, కో-ఆపరేటివ్ బ్యాంకు, కో-ఆపరేటివ్ సొసైటీలకు సంబంధించిన సుమారు 1,400 మందికి పైగా సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బిబిజి గోల్డెన్ పేట్రన్ ఇమ్మడి జ్యుయలర్స్ అధినేత ఇమ్మడి రమేష్, కత్తికా ఇన్ ఫ్రా ఎండీ, బిబిజి చీఫ్ పేట్రన్ శశికాంత్, గోల్డెన్ మాక్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఎండీ మాడిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.