Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు
నవతెలంగాణ-ఓయూ
వచ్చే నెల 14వ తేదీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చేపట్టబోయే రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలపై చేస్తున్న సమర యాత్రగా దానిని అభివర్ణించారు. కేంద్రంలో ఎనిమిదేండ్లు అధికారంలో ఉన్న మోడీ పాలనలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి యాత్రను కొనసాగించాలని సూచించారు. లేనిపక్షంలో యాత్రను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీలను కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. కనీసం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను కూడా విడుదల చేయకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలపై ప్రేమ ఒలకబోస్తూ, ఇతర రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను నవ్వులపాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన మెడికల్ కళాశాలలు, నవోదయ, సైనిక్, కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటుపై ఏ మాత్రం స్పందించడం లేదని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశాన్ని కనీసం పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదన్నారు. ఈ అంశాలపై స్పందించాల్సిందిగా సంజరుకు సూచించారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి చేసిన మేలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం, విషం కక్కడం తప్ప సంజరు చేస్తున్నదేమిటో చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ వైఖరి స్పష్టంగా అర్ధమైందని, రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంగా ఆ పార్టీకి చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు.