Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
నిషేధిత గంజాయిని హైదరాబాద్ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన ముగ్గురు సభ్యులను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి 4 కేజీల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇన్స్పెక్టర్ జాహంగీర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం అస్నన్ అహ్మద్ 15 ఏండ్ల కిందట బతుకుతెరువుకోసం బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆసీఫ్ నగర్లో ఉంటూ డ్రైవర్ వత్తిని కొనసాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత అతని సోదరుడు ఎండీ సయ్యద్ బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చి అతని వద్దనే నివాస ఉంటూ డ్రైవర్ వత్తిని కొనసాగిస్తున్నాడు. అయితే మద్యానికి, గంజాయికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని భావించి అడ్డదారులు తొక్కాడు. సయ్యద్ స్నేహితుడు రితిక్ కుమార్‌తో కలిసి ఇటీవల బీహార్ వెళ్లి ఎండీ తౌఖిక్ అనే వ్యక్తిని కలిశారు. తక్కువ రేటుకు గంజాయిని సరఫరా చేస్తానని హైదరాబాద్‌లో అవసరమైన వారికి అమ్ముతూ డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చునని చెప్పాడు. దీంతో వారు హైదరాబాద్‌లోని యువతకు గత కొన్ని సంవత్సరాలుగా గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముషీరాబాద్ పోలీసులు వినియోగదారుల మాదిరిగా ఫోన్లు చేసి కేజీ 5 వేల రూపాయల చొప్పున గంజాయి కొనుగోలు చేయడానికి మాట్లాడుకున్నారు. గాంధీనగర్‌లోని కెనరాబ్యాంక్ పార్కులో గంజాయిని ఇస్తామని చెప్పడంతో అక్కడికి రాగా మఫ్టీలో ఉన్న పోలీసులు చుట్టుముట్టి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.