Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగ్గంటల్లోనే కిడ్నాపర్‌ను పట్టుకున్న పోలీసులు
నవతెలంగాణ-మెహదీపట్నం
నీలోఫర్ ఆస్పత్రి వద్ద కిడ్నాపైన 18 నెలల చిన్నారి కథ సుఖాంతమైంది. నాలుగు గంటల్లోనే పోలీసులు కిడ్నాపర్‌ని పట్టుకొని చిన్నారిని ఆమె తల్లికి అప్పగించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం బొబ్బిలిగాంకు చెందిన మాధవి వైద్య పరీక్షల కోసం తన చెల్లెలితో కలిసి బుధవారం ఉదయం 8 గంటలో సమయంలో ఆస్పత్రికి తన 18 నెలల కూతురితోపాటు వచ్చింది. వైద్య పరీక్షల తర్వాత రిపోర్టులు తీసుకునే పనిలో ఆమె ఉండగా ఆ చిన్నారి మిస్సయింది. దీంతో ఆందోళన చెందిన మాధవి చిన్నారి కోసం చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసు లు నిలోఫర్ ఆసుపత్రికి చేరుకొని అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ గుర్తు తెలియని మహిళ చిన్నారిని ఆటోలో తీసుకుని వెళ్లడం కనిపించింది. వెంటనే పోలీసులు ఆటో నెంబర్ ఆధారంగా, ఆటో డ్రైవర్‌ను పట్టుకొని విచారించగా ఆ మహిళను అత్తాపూర్ కల్లు కాంపౌండ్ దగ్గర దింపినట్టు తెలిపాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని అక్కడ కల్లు తాగుతున్న సదరు మహిళను అరెస్టు చేశారు. నిందితురాలు నారాయణపేటకు చెందిన శ్రీదేవిగా గుర్తించారు. చిన్నారిని సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి తల్లికి క్షేమంగా అప్పగించారు. తనకు పిల్లలు లేని కారణంగా పెంచుకుందామని చిన్నారిని ఎత్తుకెళ్లినట్టు శ్రీదేవి పోలీసుల విచారణలో తెలిపినట్టు నాంపల్లి పోలీస్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉందని మరిన్ని వివరాలు తెలుసుకుంటామని చెప్పారు.