Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పచ్చదనంలో మేడ్చల్‌ను నెంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాలి
- సమీక్షా సమావేశంలో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై అన్ని శాఖల అధికారులు దృష్టి కేంద్రీకరించాలని, హరితహారాన్ని సక్సెస్ చేయాలని సీఎం ఓఎస్టీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ప్రియాంక వర్గీస్ సూచించారు. గురువారం మేడ్చల్ కలెక్టరేట్లో కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్, ట్రైనీ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీవోలతో హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంచి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని తెచ్చారని గుర్తు చేశారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో మొక్కలు నాటుతూ, వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటూ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నగరానికి అత్యంత సమీపంలో ఉందని, ఇక్కడ మరింత ఎక్కువగా మొక్కలు నాటి జిల్లాను ఆదర్శంగా రాష్ట్రంలోనే పచ్చదనంలో నెంబర్‌వన్ జిల్లాగా నిలపాలని కోరారు. ఆ దిశగా జిల్లా కలెక్టర్ హరీశ్‌తో, అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్రావు ప్రతినిత్యం మానిటరింగ్ చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో వీలైనప్పుడల్లా పర్యటించాలన్నారు. జిల్లా అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్లు, గ్రామాల సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు, సంబంధిత సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర పర్యటనలు చేయడం, సమావేశాలు నిర్వహించడం, ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాల్లో ముందుండాలన్నారు. ఆయా మున్సిపాలిటీలు, గ్రామాల్లో హరితహారం కార్యక్రమం, నర్సరీల పరిశీలనకు తాను సైతం క్షేత్రస్థాయిలో పర్యటనకు వచ్చి పరిశీలిస్తానని తెలిపారు. ఎక్కడ ఖాళీ ప్రదేశాలున్నా మొక్కలు నాటి, వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రక్షణగా ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. అందరినీ ఆకట్టుకునేలా, ప్రజలను చైతన్యం చేసేలా కార్యక్రమాలకు సంబంధించిన పెయింటింగ్స్, బొమ్మలు ఆయా గ్రామాల్లో ఖాళీగా ఉన్న గోడలపైన వేయించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ఎకరం విస్తీర్ణంలో శాండల్ వుడ్ పార్కును డెవలప్చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్‌కు సూచించారు. కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. జిల్లాలోని కండ్లకోయలో ఇటీవల ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కు గురించి వివరించారు. మరికొన్ని చోట్ల అభివృద్ధి చేసేందుకు ప్లాన్ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం సూచన మేరకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. 2022 జూన్‌లో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి సిబ్బంది అందరూ సన్నద్దంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్యాంసన్, జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో ) వెంకటేశ్వర్రావు, జిల్లా గ్రామీణాభివద్ది శాఖ అధికారి (డీఆర్డీవో), జిల్లా పంచాతీ అధికారి (డీపీవో), ఆయా శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీవోలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.