Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుకారాం గేట్ ఆర్యూబీ ప్రారంభోత్సవంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో/ఓయూ
వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.6 వేల కోట్ల వ్యయంతో పనులను పూర్తి చేసినట్టు పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రూ.72 కోట్లతో నిర్మించిన తుకారాం రైల్వే గేట్ రోడ్డు అండర్ బ్రిడ్జిని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్‌లతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ శతాబ్ద కాలం నుంచి తుకారాం గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని, ఆర్యూబీ అందుబాటులోకి రావడంతో ప్రజలకు రవాణా ఇక్కట్లు తొలగిపోతాయన్నారు. సిగల్ ఫ్రీ నగరంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలను చేపట్టి ప్రజల ట్రాఫిక్ సమస్యలు అధిగమించడం జరిగిందని చెప్పారు. నగరంలో సికింద్రాబాద్, ఖైరతాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో రైల్వేలైన్ ఉన్నందున ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించిన దశాబ్దాల కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వాటిని నెరవేర్చేందుకు అవసరమైన చోట అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలను చేపట్టేందుకు ఇటీవల రైల్వే ఉన్నతాధికారులతో పిలిపించి చర్చించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులను ఇప్పటికే చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు మాట్లాడుతూ తుకారాం రైల్వే గేట్ వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, ప్రజల చిరకాల వాంఛగా ఉండేదని, కేటీఆర్ సారథ్యంలో ప్రజల వాంఛ నెరవేరిందని, ఉద్యమ కాలంలో కూడా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకున్నామని గుర్తుచేశారు. అడ్డగుట్ట యువత సహకారంతో తిరిగి అక్కడ నుండి గమ్యస్థానానికి చేరుకున్నట్టు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. దళిత అభ్యున్నతి కోసం దళిత బంధు అమలు చేస్తున్నారని, మార్చి, ఏప్రిల్‌లో అధిక మొత్తంలో ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ అండర్ బ్రిడ్జితో మల్కాజిగిరి, మారేడ్‌పల్లి, మెట్టుగూడ, లాలాపేట్ ట్రాఫిక్ రద్దీ తగ్గిస్తుందని, మౌలాలి, మల్కాజిగిరి, తార్నాక సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు రోడ్డు కనెక్టివిటీ ఉంటుందన్నారు. సమావేశంలో టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, సునీత, ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, టీఆర్ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, ఎస్అర్డీపీ సీఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్‌రాజు, ఈఈ గోపాల్ పాల్గొన్నారు.