Authorization
Mon March 17, 2025 10:33:32 pm
- ఎమ్మెల్యే దానం నాగేందర్
- అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం వెంకటేశ్వర కాలనీ డివిజన్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును, స్థానిక ప్రజల అవసరాల కోసం ఏర్పాటుచేసిన రెండు వేల లీటర్ల నీటి సదుపాయం గల సింటెక్స్ను స్థానిక కార్పొరేటర్ కవిత రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలరీత్యా 300 గజాల స్థలంలో రాబోయే రోజుల్లో ఓ కమ్యూనిటీ హాల్, అలాగే బస్తీలో ఉన్న 50 గజాలలో కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక బస్తీ కమిటీవాసులు యాదగిరి, మూర్తి, కిరణ్, డివిజన్ అధ్యక్షులు రాములు చౌహన్, మహిళా అధ్యక్షులు మధు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.