Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎక్సైజ్ శాఖలో ఉద్యోగమా? నువ్వేం చేయగలవు. అది మగవాళ్ల జాబ్. 24 గంటల డ్యూటీ చేయాల్సి ఉంటుంది. నీతో సాధ్యం కాదు' అంటూ నిరాశకు గురిచేసే పలువురి మాటలకు ఆమె కృంగిపోలేదు. పైగా వాటినే ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. అసాధ్యం అన్నదానినే మహిళలు ఏదైనా సాధించగలరని నిరూపించారు ఎక్సైజ్‌శాఖలో గోల్కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శారద. ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ ప్రతిభ కనబరుస్తూ పై అధికారులతో శభాష్ అనిపించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న ఆమెను మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని నవతెలంగాణ పలకరించింది.
-భయపడినంతకాలం వివక్షపోదు, ధైర్యంగా ఎదుర్కోవాలి
- ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ శారద
నవతెలంగాణ-మెహదీపట్నం
నవతెలంగాణ: నమస్తే మేడమ్. మీకు అడ్వాన్స్‌గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
శారద: థాంక్యూ, అలాగే అందరికీ అడ్వా న్స్‌గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
నవతెలంగాణ: సర్కిల్ ఇన్స్పెక్టర్గా సక్సెస్ అవుతున్నారు? మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది?
శారద: మా స్వస్థలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. టెన్త్, ఇంటర్మీడియట్ అచ్చంపేటలోని గవర్నమెంట్ స్కూల్లో, డిగ్రీ అచ్చంపేటకు దగ్గర్లోని కొండనాగులలో పూర్తిచేశా.
నవతెలంగాణ: మీరు ఈ ఉద్యోగంలోకి ఎలా వచ్చారు?
శారద: డిగ్రీ పూర్తయిన కొద్దికాలానికి పెండ్లి అయింది. భర్త పేరు కిషన్ ప్రసాద్. అతను ఇప్పుడు అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్. పెండ్లయినా కొత్తలో అతను నల్గొండ జిల్లాలోని బీబీనగర్‌లో గవర్నమెంట్ టీచర్‌గా పనిచేసేవారు. నాది కూడా అప్పటికే బీఈడీ పూర్తికావడంతో అదే స్కూల్లో వాలంటీర్‌గా పని చేశాను. ఈ క్రమంలో నేను గ్రూప్స్‌కు ప్రిపేరై 2007లో గ్రూప్ 2లో ఎక్సైజ్ ఎస్ఐగా ఎంపికయ్యాను.
నవతెలంగాణ: సాధారణంగా గ్రూపు 2లో డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ లాంటి ఉద్యోగాలను వదిలి ఎక్సైజ్ డిపార్టుమెంట్‌కు ఎందుకు రావాలనిపించింది?
శారద: గ్రూప్‌లో ఉన్న అన్ని ఉద్యోగాలకు ఆప్షన్ ఇచ్చాను. కానీ నా మెరిట్‌ని అనుసరించి నాకు ఎక్సైజ్ శాఖలో ఎస్ఐగా ఉద్యోగం వచ్చింది. ఎక్సైజ్ శాఖలో ఎస్సై ఉద్యోగమా? అది మగవాళ్ల జాబ్. 24 గంటల డ్యూ టీ చేయాల్సి ఉంటుంది. నీతో సాధ్యం కాదు అని పలువురు నన్ను నిరుత్సాహపరిచారు. ఏదైనా ఒక ఆపదగాని, కష్టం గాని వచ్చినప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని విజయం సాధించే దాకా పోరాడే మనస్తత్వం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు పడింది. దాంతో ఆ మాటలను నేను ఛాలెంజ్‌గా తీసుకున్నాను. మగవాళ్ల కంటే మిన్నగా ఈ ఉద్యోగం చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యా. ఇప్పటివరకు ఉద్యోగ జీవితంలో ఎటువంటి ఆరోపణలు, వివాదాలు లేకుండా సక్సెస్ అయ్యాను.
నవతెలంగాణ: మీరు చదువుకున్నప్పటి కాలానికి, ఇప్పటికి మహిళల్లో అక్షరాస్యత, చదువు ఎలా ఉంది? ఏమైనా మార్పులు వచ్చాయని అంటారా?
శారద: అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి, చదువుపట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆడపిల్లల్ని చదివించేందుకు పేరెంట్స్ ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వాలు కూడా బేటీ బచావో బేటీ పడావో, మహిళలకు ఉచిత విద్య అంటూ ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఆ మార్పులు సూపర్ ఫిషియల్గానే అనిపిస్తున్నాయి. ఇంకా చాలా మారాల్సిన అవసరం ఉంది. గతంతో పోలిస్తే మాత్రం చదువు విషయంలో ఇప్పుడు బెటర్.
నవతెలంగాణ: మహిళా వివక్షపై మీ అభిప్రాయం?
శారద: ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు కొందరు తల్లిదండ్రులు బర్డెన్‌గా భావిస్తుంటారు. ఇది బాధాకరం. అక్కడ ప్రారంభమైన వివక్ష జీవితాంతం కొనసాగడం కడు శోచనీయం. దీనికి పరిష్కారం మహిళలు చదువుకోవాలి. చైతన్యం కావాలి. వివిధ రంగాలలో ప్రవేశించాలి. వినూత్నమైన విజయాలు సాధించాలి. దీనివల్ల పరిస్థితి మారుతుంది. ఆడపిల్లల పట్ల సమాజంలో వివక్ష తగ్గిపోతుంది.
నవతెలంగాణ: ఉద్యోగ జీవితంలో మహిళగా ఎప్పుడైనా వివక్షను ఎదుర్కొన్నారా?
శారద: అవును ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ తక్కువ మోతాదులో అని చెప్పవచ్చు. మనం భయపడినంత కాలం ఇలాంటి వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మహిళలు ధైర్యంగా వివక్షను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారో అప్పుడే అది అంతం అవుతుంది.
నవతెలంగాణ: మహిళా సాధికారత గురించి ఏం చెప్తారు?
శారద: మహిళా సాధికారత చాలా ముఖ్యమైంది. ఒక పురుషుని చదువు, ఉద్యోగం వల్ల అతని కుటుంబం మాత్రమే బాగుపడితే, ఒక స్త్రీ వల్ల చదువు, ఉద్యోగం వల్ల ఆమె కుటుంబంతో పాటు సమాజం, తద్వారా దేశం కూడా బాగుపడుతుందనేది వాస్తవం. ప్రభుత్వాలు మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నాయి కానీ ఇంకా చేయాల్సి ఉంది.
నవతెలంగాణ: మీరు ఈ స్థితికి చేరుకోవడానికి ఎటువంటి ప్రోత్సాహం లభించింది?
శారద: నేను ఈ స్థితికి చేరుకోవడానికి నా భర్త ప్రోత్సాహం ఎంతో ఉంది. విద్యావాలంటీర్‌గా పనిచేస్తున్నప్పుడు ఇంకా బాగా చదువుకోవాలని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.
నవతెలంగాణ: చివరగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరిచ్చే సందేశం ఏమిటి?
శారద: మహిళలు ముందుగా తాము ఏమి సాధించాలనుకుంటున్నారో దాని గురించి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో మనకు ఎవరో వచ్చి సపోర్ట్ చేస్తారని ఆశించవద్దు. తను ఏం చేయాలి ఏం సాధించాలి అని ఒక నిర్ణయం తీసుకొని దృఢనిశ్చయంతో ముందుకు వెళ్లాలి. అప్పుడే విజయం సొంతమౌతుంది.