Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రంట్ నూతన చైర్మెన్ నారగోని, రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ బాలకష్ణ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
బహుజనులు రాష్ట్రాన్ని పరిపాలించడానికే తెలంగాణ బహుజన ఫ్రంట్ ఏర్పాటు చేశామని ఫ్రంట్ నూతన చైర్మెన్ నారగోని, రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ బాలకష్ణ తెలిపారు. శుక్రవారం గన్ ఫౌండ్రిలోని ఫ్రంట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ బహుజన ఫ్రంట్ ఏర్పాటు అవసరం, ఆశయాలు, ఆచరణలో చేసే కార్యక్రమాలు, కరపత్రాన్ని విడుదల చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో మొత్తం అగ్రవర్ణాల వారే అధికారాన్ని అనుభవిస్తున్నారని, రాజకీయ, ప్రభుత్వ పదవులు, నియామకాలు, పరిశ్రమలు, కాంట్రాక్టులు అన్ని దొరల- భూస్వామ్య కుటుంబాల వారసులకు ధారాదత్తం చేయబడ్డాయని ఆరోపించారు. అట్టడుగు సామాజిక వర్గాల జీవితాలకు వెలుగు నిచ్చే విద్యను కూడా సంపూర్ణంగా ప్రయివేటుపరం చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. ముస్లింల పౌరత్వానికి భంగం కలిగించే విదంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకురావడం, అభద్రతా భావానికి గురిచేయడం వంటి విధానాలను ప్రతిఘటిస్తామని మోడీ ప్రభుత్వానికి హెచ్చరించారు. అంబేద్కర్ ప్రసాదించిన రిజర్వేషన్లను తీసివేయాలనే కుట్రతో సీఎం కేసీఆర్ కొత్త రాజ్యాంగం కావాలని కోరుతున్నాడని, దీనిని బహుజనులందరు తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఫలాలను, రాజ్యాధికారం యావత్తు బహుజనులకే దక్కాలనే ప్రధాన ఆశయంతో తెలంగాణ బహుజన ఫ్రంట్ ఆవిర్భవించిందని అయన తెలిపారు. సమావేశంలో సలహాదారులు కె.ఎన్. రామదాసు, కన్వీనర్లు ప్రొఫెసర్ వెంకట్ దాస్, బి. మహేష్ బాబు, సూర్యనారాయణ, సనావుల్లాV్‌ా ఖాన్, అబ్దుల్ వారిస్, సలీమ్ బాషా, డాక్టర్ టివి. రామ నర్సయ్య, అలీం ఖాన్, పన్నేరు మోహన్ రాజ్ పాల్గొన్నారు.