Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 713 సివిల్ కేసులు రాజీ
- బాధితులకు 28 కోట్ల పరిహారం
- సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుకా యారా
నవతెలంగాణ-సిటీబ్యూరో
శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. జాతీయ లోక్ అదాలత్‌లో 713 సివిల్ కేసులు రాజీ మార్గంలో పరిష్కారం అయినట్టు హైదరాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్ట్ చైర్పర్సన్, చీఫ్ జడ్జి రేణుకా తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ వాహనాల రోడ్డు (మోటార్ యాక్సిడెంట్) ప్రమాదలో బాధితులకు లోక్ అదాలత్ ద్వారా హైదరాబాదులో రూ. 26,46,89, 684ల నష్టపరిహారం అందించేలా వివాదాల పరిష్కారం అయ్యాయని తెలిపారు. 222 ఫ్రీ లిటిగేషన్ కేసుల ద్వారా బ్యాంకులకు, బాధితులకు వ్యక్తులకు రూ.2,09,18,716 సొమ్మును తిరిగి చెల్లించేలా అంగీకరించారన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టుతోపాటు హైదరాబాద్ సిటీ స్మాల్ కాజ్ కోర్టుల్లో పది బెంచీలను ఏర్పాటు చేసి పలు కేసులను రాజీ పద్దతిలో పరిష్కారం చేసినట్టు చీఫ్ జడ్జి తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ కోసం గత నెల రోజులుగా విస్తృత స్థాయి సమావేశాలు, ఫ్రీ లిటిగేషన్ సెట్టింగ్‌లు ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకున్నట్టు న్యాయమూర్తి వివరిం చారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో తమ కేసుల పరిష్కారం కోసం ఉత్సాహంగా ముందుకు వచ్చిన కక్షిదారులకు మరియు న్యాయవాదులకు న్యాయమూర్తి రేణుక యారా ధన్యవాదాలు తెలిపారు. జాతీయలోక్ అదాలత్‌కు పెద్దసంఖ్యలో హాజరయ్యారని, వారికి ఆహారం, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించినట్లు హైదరాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే. మురళీమోహన్ తెలియజేశారు. లోక్ అదాలత్ ఈ సందర్భంగా నల్సా మరియు తేలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు న్యాయ కళాశాల విద్యార్థులచే జాతీయలోక్ అదాలత్ సర్వే నిర్వహించినట్లు కే. మురళీ మోహన్ తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో పెండేకంటి లా కళాశాల మరియు కేశవ మెమోరియల్ లా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. పురానా హవేలిలోని సిటీ సివిల్ కోర్టులో రెండవ అదనపు చీఫ్ జడ్జి కె.ప్రభాకర్ రావు, కమర్షియల్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు, సీనియర్ సివిల్ జడ్జి కవిత జూనియర్, సివిల్ జడ్జి వింద్యా నాయక్ నేతృత్వంలో నిర్వహించారు. సిటీస్ మల్కాజ్ కోర్టు చీఫ్ జడ్జి నిర్మల గీతంబ ఆధ్వర్యంలో సిటీ స్మాల్ కాజ్ కోర్టులో లోక్ అదాలత్ జరిగింది.