Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5, 2 కిలోల సిలిండర్ల విక్రయానికి కసరత్తు
- 90 దుకాణాల్లో ప్రయోగాత్మకంగా అమలుకు నిర్ణయం
- సర్కిల్‌కు 10 చొప్పున రేషన్ షాపుల ఎంపిక
- విజయవంతమైతే ఇక అన్ని దుకాణాల్లో
- పంపిణీ ఏర్పాట్లపై అధికారుల కసరత్తు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంట్లో వంట చేస్తుండగా మధ్యలో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ అయిపోతే.. వెంటనే సిలిండర్ కోసం తెలిసినవాళ్లనో.. పక్కింటి వాళ్లమో అడిగి తీసుకుంటాం.. ఆతర్వాత సిలిండర్ బుక్ చేసి.. ఓ నాలుగైదు రోజులకు తిరిగి ఎవరిది వారికి ఇచ్చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో బదులు ఇచ్చిన వారి ఇంట్లో కూడా సిలిండర్ అయిపోతే ఇక అప్పుడు అసలు సమస్య ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులకు అడ్డుకట్ట వేయడానికి ఇక నుంచి రేషన్ దుకాణాల్లో సరుకులతో పాటు 5, 2 కిలోల మినీ గ్యాస్ సిలిండర్లను అందు బాటులో ఉంచనున్నారు. ఈ మేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు.. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు ఏర్పాట్లపై దృష్టిసారించారు. కాగా ఇప్పటికే రేషన్, గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఇందులో గ్యాస్ సిలిండర్లను నిలువ ఉంచే ప్రక్రియ, భద్రత, సరఫరా విధానంపై కూడా డీలర్లకు అవగాహన కల్పించారు. త్వరలో రేషన్ దుకాణాల ద్వారా మినీ సిలిండర్లు విక్రయానికి శ్రీకారం చుట్టనున్నారు. రేషన్ కార్డు ఉన్నా.. లేకున్నా ఇబ్బంది లేదు. అవసరమైన వారు ఎవరైనా కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.
సర్కిల్కో తొమ్మిది దుకాణాలు..
హైదరాబాద్ జిల్లాలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 668 రేషన్ దుకాణాలున్నాయి. ఇందులో అంబర్పేట్, ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్ మలక్‌పేట్, యాకుత్‌పుర, చార్మినార్, నాంపల్లి, మెహదీపట్నం సర్కిళ్లలో 10 దుకాణాల చొప్పున మొత్తం 90 దుకాణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇది విజయవంతమైతే ఒకటి రెండు నెలల్లో అన్ని దుకాణాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. కాగా రేషన్ డీలర్లకు స్థానికంగా ఉండే గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో సమన్వయం చేసి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రతినెలా గ్యాస్ కంపెనీలు రేషన్ డీలర్ల సిండికేట్ ఆధారంగా 5, 2 కిలోల సిలిండర్లను రేషన్ దుకాణాలకు సరఫరా చేయనున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే.. మినీ సిలిండర్ల బ్లాక్ దందాకు తెరపడే అవకాశం ఉండడంతో పాటు ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం పంపిణీతో తమకు కమీషన్ గిట్టుబాటు కావడం లేదంటున్న డీలర్లకు ఒక్కొ 2, 5 కిలోల సిలిండర్ల విక్రయం ద్వారా రూ.40కుపైనే కమీషన్ పొందనున్నారు.
బియ్యంతో పాటు సిలిండర్
జిల్లాలోని 668 రేషన్ దుకాణాల పరిధిలో 6,36,698 మొత్తం రేషన్ కార్డులున్నాయి. ఇందులో అంతోద్యయ కార్డులు 30,073, ఆహార భద్రత కార్డులు 6,05,245, అన్నపూర్ణ కార్డులు 1,310 ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీలు 47 ఉండగా.. గ్యాస్ కనెక్షన్లు 7-8 లక్ష వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ 19 కిలోలు, డొమెస్టిక్ సిలిండర్ 14.2 కిలోల కెపాసిటీతో వస్తే ఈ మినీ సిలిండర్లు కేవలం 5, 2 కిలోల కెపాసిటీతో వస్తాయి. అత్యవసరంగా గ్యాస్ సిలిండర్ అవసరం అయినవారికి, బ్యాచిలర్స్‌కు, వలస కూలీలకు ఈ మినీ సిలిండర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక గ్యాస్ కనెక్షన్లు లేనివారు నేరుగా రేషన్ దుకాణం నుంచి బియ్యంతో పాటు గ్యాస్ సిలిండర్ ను పట్టుకెళ్లవచ్చు. ఈ సిలిండర్ల విక్రయానికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్ ధర రూ.955 ఉంది. రేషన్ డీలర్ల ద్వారా సరఫరా చేయాలనుకుంటున్న 5, 2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ల ధర మాత్రం అధికంగా ఉంటుందని సమాచారం. 5 కిలోల సిలిండర్ రూ.500-600 మధ్యలో ధర పలుకుతుందని.. 2 కిలోల సిలిండర్ ధర ఇంకా మార్కెట్లోకి రాలేదని తెలుస్తోంది. కాగా మినీ సిలిండర్ల ధర ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చునని అధికార వర్గాలు పేర్కొన్నాయి.