Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: ఐఎఫ్టీయూ
నవతెలంగాణ-ఓయూ
ఓయూ హాస్టల్, మెస్‌లలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఎస్ ఎల్ పద్మ, రాష్ట్ర నాయకులు ఎం హన్మేష్, ప్రోగ్రెసివ్ కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు ఐఎఫ్టీయూ అనుబంధ ప్రోగ్రెసివ్ కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఓయూలో వివిధ హాస్టల్, మెస్ లలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. 2021 -22లో హాస్టల్స్ ఉద్యోగులకు ప్రతి ఏడాది 15 శాతం లేదా రూ.1500 పెరగాలని, కానీ యూనివర్సిటీ పెంచలేదన్నారు. తక్షణమే జీతాలు పెంచి ఎరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. 'రాష్ట్ర ముఖ్యమంత్రి మార్చి 7న అసెంబ్లీలో ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఓయూలో హాస్టల్లో 1992 నుంచి పర్మినెంట్ ఉద్యోగాల నియామకం జరగలేదు. ఆనాటి నుంచి పెరుగుతున్న హాస్టళ్ల సంఖ్య, పర్మినెంట్ ఉద్యోగులు చనిపోవడం, రిటైర్మెంట్ అవ్వడం వల్ల అనేక ఖాళీలు ఏర్పడ్డాయి. వాటి స్థానాల్లో క్యాజువల్ ఉద్యోగులుగా జాయిన్ అయి చేస్తున్న వారిని అవుట్ సోర్సింగ్‌లో కలిపేసి తీవ్ర అన్యాయం చేశారు' అని చెప్పారు. యూనివర్సిటీ ఇంతవరకు హాస్టల్ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఓయూ నాయకులు కౌసర్, అనసూయ, కవిత, జయ, అంజద్ సుల్తాన్, పద్మా, విజయ, వనజ, సావిత్రి, రూప పాల్గొన్నారు.