Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
నాగోల్ డివిజన్ మున్సిపల్ కార్మికుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కేసరి నర్సిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై పలుమార్లు సార్వత్రిక సమ్మెలు చేయడం జరిగింది అన్నారు. సమ్మెలో సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీఎన్టీసీి, ఏఐయూటీయూసీి, కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్స్ సమ్మె నిర్వహిస్తున్నాయని అయన తెలిపారు. ఈ సమ్మెలో జీహెచ్ఎంసీి కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. నిత్యావసర ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా కనీస వేతనం రూ.26వేలు ఉండాలని నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంలేదన్నారు. కోట్లాది మంది కార్మికులకు వర్తించే ఈపీఎఫ్, పెన్షన్ నెలకు రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. బ్రిటీిష్ కాలం నుండి అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను, ఫ్యాక్టరీ చట్టాలు, బోనస్ చట్టాలు, పారిశ్రామిక వివాదాల చట్టం తదితర చట్టాలను రద్దు చేసి కార్మికులను బానిసలుగా చేయడం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో సీిహెచ్ మల్లేశం, మైసయ్య, ప్రమీల, అండాలు, యాదమ్మ, మంగ తదితరులు పాల్గొన్నారు.