Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత యువజన సమాఖ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్
నవతెలంగాణ-కాప్రా
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా రాష్ట్ర బడ్జెట్ అలాగే ఉందని , 2లక్షల పైగా బడ్జెట్లో కూసింత కూడా ఉద్యోగాలు, భృతి గురించి ఊసు ఎత్తక పోవడం నిరుద్యోగులను నిండా మోసం చేయడమే అని అఖిల భారత యువజన సమాఖ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో ఆదివారం జిల్లా అధ్యక్షుడు సత్య ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్లు వస్తాయని ఊదరగొట్టి పబ్బం గడుపుకునే రాష్ట్ర ప్రభుత్వం నిజ స్వరూపం తేటతెల్లమైందని, ఈ బడ్జెట్ బట్టబయలు చేసిందని వారు అన్నారు. ఆర్భాటంగా ఇస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఉలుకు పలుకు కూడా లేదని, మొత్తంగా యువత హృదయాలను గాయపరిచి నిట్టనిలువుగా వంచన బడ్జెటే అని వారు ధ్వజమెత్తారు. ఎంప్లాయీమెంట్ ఎక్చేంజ్ లకు ఒక్క పైసాకూడా కేటాయించకుండా నడిరోడ్డుమీద పడేసినట్లు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కు కేంద్రంలోని మొండి చెయ్యి చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వం డోకా చేసిందని వారు అన్నారు. కేంద్రం గతంలో 27కోట్ల 64లక్షల 35వేల నుంచి 1 కోటి 13లక్షలు తగ్గించి చేతులు దులుపుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించిన బిశ్వాల్ కమిటీ రాష్ట్రంలో ఖాళీలు ఒక లక్షా 92 వేల పైచిలుకు గా ఉన్నాయని గతంలోనే కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్రం ఏర్పడే నాటికి స్వయంగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు ఏడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు. ఏడు సంవత్సరాల కాలంలో లక్షా యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చట్ట సభ సాక్షిగా కేసీఆర్ ప్రకటించడం అంటే తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరుల ఆత్మలు ఘోషిస్తాయన్నారు. తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పడిన నాటి నుంచి మొన్నటి వరకు 104 నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసిన ఉద్యోగాలు 32 వేల పైచిలుకు మాత్రమే. మొన్న కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగాల ప్రకటనను నోటిఫికేషన్ ద్వారా సత్వరమే గడువు పెట్టి భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా నిర్మాణ బాధ్యులు ఉమా మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, ఆఫీస్ బీరేర్స్ ప్రసాద్, కాసర్ల నాగరాజు, మణి గౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.