Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21న ధర్నాచౌక్‌లో మహాధర్నా
- భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ)
- రాష్ట్ర అధ్యక్షులు వంగూరి రాములు
నవతెలంగాణ-ధూల్‌పేట్
భవన నిర్మాణ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదని భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు వంగూరి రాములు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా విస్త్రృతస్థాయి సమావేశం నిర్వహించారు. బీసీడబ్ల్యూ సౌత్ జిల్లా నాయకులు కె.జంగయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి రాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పునరుద్ధరించాలన్నారు. 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలనీ, ప్రజల సొమ్మును కార్పొరేటర్లకు అప్పనంగా అంటగట్టే ప్రయత్నాలను ఆపాలన్నారు. అంతర్రాష్ట్ర వలస కార్మికుల రక్షణ చట్టం, నిర్మాణ రంగంలో పెరిగిన ముడిసరుకుల ధరలను వెంటనే అరికట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంం అక్రమంగా దారి మళ్లించిన రూ.1005 కోట్లను తిరిగి బోర్డులో జమ చేయాలన్నారు. కార్మికులకు లేబర్ అడ్డాల దగ్గర కనీస సౌకర్యాలను కల్పించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28,29న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న ధర్నా చౌక్‌లో చేపట్టిన మహా ధర్నాకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మైలారం జంగయ్య, సీహెచ్ రామకృష్ణ, బాజిబబా, సుబ్బారావు, విష్ణు, సీఐటీయూ సౌత్ జిల్లా కార్యదర్శి పి.నాగేశ్వర్, 125 మంది కార్మికులు పాల్గొన్నారు.