Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి భూపాల్
నవతెలంగాణ-ధూల్‌పేట్/మెహదీపట్నం
విద్యుత్ రంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సౌత్ కమిటీ కార్యాలయంలో మార్చి 28, 29న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ స్టేట్ యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంలో ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్‌ను అమలు చేయాలన్నారు. కరోనా సమయంలో విద్యుత్ కార్మికులు ఫ్రంట్లైన్లో ఉండి పని చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదన్నారు. ఆర్టిజన్ నుంచి కార్మికులకు జేఎల్ఎం ప్రమోషన్లు ఇవ్వాలని, విద్యుత్ సంస్కరణల బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులు సంస్థకు గుండెకాయలాంటి వారని, వారికి రెగ్యులర్‌తో పాటు సమాన పనికి సమాన వేతనం అందజేయాలన్నారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం కార్మికులకు వేతనాలు రూ.26వేలు అందించాలన్నారు. ఈనెల 29న కార్మికుల సమస్యలపై జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం శ్రావణ్ కుమార్, ఎం.మీనా, మహమ్మద్ సులేమాన్, బి.రమేష్ నాయక్, కె.శ్రీధర్, ఎస్.సురేష్ గౌడ్, యూనియన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ నగర నాయకులు విఠల్, హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాములు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో ఆదివారం హమాలీ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 55 ఏండ్లు పైబడిన హమాలీ కార్మికులకు పింఛన్ సౌకర్యం, లైసెన్సులు, డ్రెస్సులు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐకమత్యంగా తమ పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఈనెల 28, 29వ తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించబోయే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు రఘు, మధు, హనుమంతు, మన్యం నాయక్, బాలునాయక్, రాజు, శివప్ప, కిష్టప్ప, రవి, తులసి రామ్, రాజు, జంగయ్య ,శివం, ఖాన్, రామునాయక్ పాల్గొన్నారు.