Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సారెగూడెంలో గల గంగన్నకుంటను అక్ర మార్కులు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడి ఎఫ్టీఎల్ స్థలంలో రాత్రికి రాత్రే సదరు కబ్జాదారుడు రెడీమేడ్ సిమెంట్ పలకలతో సుమారు 200 గజాల స్థలంలో ఇటీవల కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. అయితే అదే రోజు రాత్రి సదరు కబ్జాదారు నిర్మాణం పూర్తిచేశాడు. తెల్లారేసరికి నిర్మాణం ఉండటంతో స్థానికులు సదరు కబ్జాదారుకు అధికారుల అండదండలు ఉండవచ్చని, అందుకే కబ్జా చేసి నిర్మాణం చేయగలిగాడని ఆరోపిస్తున్నారు. ఎంతో విలువైన ఎఫ్టీఎల్ భూమిని కబ్జా చేస్తుంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే ప్రాంతంలో మరో కుంట ఎఫ్టీఎల్ పరిధిలో మట్టిని జేసీబీ ద్వారా తరలించి ఓ వ్యక్తి తన పట్టా స్థలానికి రోడ్డు కలుపుకోవడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఇలా ఒక్క డి పోచంపల్లి పరిధిలోని సారెగూడెంలోనే కాకుండా మండలం పరిధిలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.