Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఆదివాసీలకు, సమ్మక్క, సారక్క భక్తులకు చిన్నజీయర్ స్వామి తక్షణమే క్షమపణలు చెప్పాలని ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం విద్యార్థులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఆదివాసీ షెడ్యూల్ ప్రాంతాల్లో మఠాలు నిర్మించుకొని ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయలపై అహంకార పూరితంగా మాట్లాడుతున్న చిన్నజీయర్ స్వామిని ఆదివాసీ ప్రాంతాల్లో నుంచి తరిమికొడుతామని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భక్తితో కొలుచుకునే సమ్మక్క, సారక్కలపై అవగాహన రాహిత్యంగా భారతీయుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకుడు కిషోర్, ఆదివాసీ స్టూడెంట్ ఫోరం విద్యార్థులు సుధీర్, లక్ష్మణ్, కష్ణ, కిషోర్, వివేక్, ఆదివాసీ సాంస్కతిక సభ్యులు ఝాన్సీ పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ నమోదు చేయాలి
సమ్మక్క, సారక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బుధవారం ఓయూ విద్యార్థి సంఘాలు, మాదిగ స్టూడెంట్ యూనియన్, విద్యార్థి జన సమితి సంఘాల ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ, విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు బాబుమహాజన్, విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసంపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన చినజీయర్ స్వామి ఆదివాసీ, ప్రకతి దేవతలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలుగా ఉన్న సమ్మక్క, సారలక్కలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం పట్ల కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఆదివాసీ దేవతలను అవమానించిన చిన జీయర్ స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ యూనియన్ ఓయూ అధ్యక్షులు బొర్రా శాంతి కుమార్, మురళి, రాజేష్ కుమార్, రవి నాయక్ పాల్గొన్నారు.