Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలనీ, కంటోన్మెంట్ భూ బదలాయింపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యులు ధర్నా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రక్షణ శాఖ స్థలాల్లో నివాసాలు ఉంటున్న పౌరుల ఓట్లను తొలగించారనీ, తొలగించిన ఓటు హక్కును తిరిగి పునరుద్ధరణ చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 58, 59 ప్రకారం భూ బదలాయింపు చేపట్టాలని కోరుతూ ధర్నా చేపట్టారు. మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర, సభ్యుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో మర్డ్ ఫోర్ట్ ప్రభుత్వ పాఠశాల వద్ద జరిగిన కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నరేష్, పార్టీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రక్షణశాఖ అధికారులు భూ బదలాయింపు చేయకపోవడం వల్ల కంటోన్మెంట్లో పేద ప్రజలకు రావడం లేదనీ, పైగా రక్షణశాఖ భూముల్లో ఏండ్ల తరబడి నివాసం ఉంటున్న అక్రమ భూ అక్రమదారులుగా పేర్కొంటూ రక్షణ శాఖ అధికారులు 28 వేల పేద ప్రజల ఓటు హక్కులను తొలగించారని చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో మాత్రం వినియోగించుకో కూడదని బోర్డ్ ఎన్నికల జాబితాలో నుంచి తొలగించారని తెలిపారు. ఈ విషయంపై బీజేపీ మంత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రక్షణశాఖ అధికారులు భూ బదలాయింపు చేసి ఉంటే ఈ రోజు పేద ప్రజల ఓటు హక్కు పోగొట్టుకుని ఉండేవారు కాదన్నారు. ప్రస్తుతం 28 వేల మంది పేద ప్రజలు ఓటు హక్కు లేకపోవడం వల్ల వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా అందలేసి పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూం రావాలన్నా ఆ పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్నా ఓటర్ ఐడీ ఉండాలన్నారు. రక్షణ శాఖ అధికారులు వెంటనే స్పందించి వారికి ఓటు హక్కు కల్పించాలనీ, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల ద్వారా వారి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సభ్యులు నళినీ కిరణ్, పాండు యాదవ్, ప్యారాసాని శ్యామ్ కుమార్, ప్రవీణ్ రాజు సింగ్ పిట్ల నాగేష్ ముప్పిడి మధుకర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.