Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ
నవతెలంగాణ-మెహిదీపట్నం/జూబ్లీహిల్స్
ఈనెల 28, 29న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయూ నాంపల్లి కమిటీ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ యాత్ర నిర్వహించారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు నాంపల్లి లేబర్ అడ్డా వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ విజయనగర్ కాలనీ లేబర్ అడ్డా, రెడ్ హిల్స్, మెహదీపట్నం బస్టాప్, ఎలక్ట్రిసిటీ డీఈ ఆఫీస్, బోజగుట్ట, ఝాన్సీ టెంపుల్ తదితర ప్రాంతాల గుండా తిరుగుతూ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రేతిబౌలిలోని అంబేద్కర్ నగర్ వద్ద ముగిసింది. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, నగర ఉపాధ్యక్షులు మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఈనెల 28, 29న జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బి శంకర్, కురుమయ్య, లక్ష్మణ్, పుల్లారావు, సురేష్, రాజు, మన్సూర్, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎంఓకు సమ్మె నోటీసు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 28, 29న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో పాల్గొనేందుకు ఎర్రగడ్డ ప్రభుత్వ మెంటల్ హాస్పిటల్ కార్మికులకు అనుమతి ఇవ్వాలని ఆర్ఎమ్ఓకు జూబ్లీహిల్స్ జోన్ సీఐటీయూ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు. దేశవ్యాప్తంగా జరిగే సమ్మె వల్ల కార్మికుల హక్కులు సాధించవచ్చని, అందుకే ప్రతి ఒక్క కార్మికుడు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో హాస్పిటల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సైదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, మరియు నాయకులు పాల్గొన్నారు.