Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపయోగంగా హయత్‌నగర్ ఆర్టీసీ భవనం
- రూ. 4 కోట్లతో మూడంతస్తుల నిర్మాణం
- ఆదాయం వచ్చేలా చొరవచూపాలంటున్న విశ్లేషకులు, ప్రయాణికులు
నవతెలంగాణ-హయత్‌నగర్
సురక్షిత ప్రజా రవాణాగా పేరున్న ఆర్టీసీకి గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజా, కార్మిక పోరాటాలవల్ల ఇటీవల ప్రయివేటీకరణ ముప్పు తప్పిందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ ఎండీగా మాజీ సీపీ, సజ్జనార్ వచ్చాక ఆ సంస్థలో కొత్త ఊపు వచ్చింది. సంస్థను ప్రగతి పథంలో నడిపించేలా వారు తీసుకుంటున్న చర్యలు ప్రజల, కార్మికుల దృష్టిని ఆకర్షిస్తూ ఆర్టీసీపై మరింత నమ్మకాన్ని పెంచేలా ఉంటున్నాన్న చర్చ జరుగుతోంది. అయితే కొన్నిచోట్ల ఆర్టీసీ వనరులు పూర్తిగా సద్వినియోగం అవుతున్నాయా? అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. హయత్‌నగర్‌లో 2015లో రూ. 4 కోట్ల జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో నిర్మించిన మూడంతస్తుల ఆర్టీసీ బస్టేషన్‌ను నిర్మించారు. అతిపెద్ద భవనం కావడంతో దానిని ఆర్టీసీ సంస్థకు ఆదాయ వనరుగా మల్చుకోవాలన్న ఉద్దేశం ఉంది కానీ అది ఇంత వరకు ఆచరణ రూపం మాత్రం దాల్చడం లేదు. ఇక్కడి ఆర్టీసీ భవన్లో ఒక చదరపు అడుగుకు రూ. 24 చొప్పున అద్దెగా నిర్ణయించారు. మొదటి, రెండో, మూడో అంతస్తుల విస్తీర్ణం 5755 చదరపు అడుగులుగా ఉంది. ఆర్టీసీ అధికారుల లెక్కల ప్రకారం మొత్తం భవనానికి నెలకు సుమారు 1.5 లక్షల ఆదాయం రావాలి. ఆ విధంగా ఏడేండ్లకుగాను రూ. 12 కోట్ల 60 లక్షలు రావాలి. కానీ రావడం లేదు. ఎందుకంటే ఏడేండ్ల నుంచి ఇందులో ఎవరూ అద్దెకు రావడం లేదు. ఇది ఆదాయ వనరుగా ఉపయోగపడి ఉంటే ఆర్టీసీకి ఎంతో ఊరటగా ఉండేది కదా! అధికారులు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్న సందేహాలు ప్రయాణికులు, ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆర్టీసీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. అప్పుల్లో కూరుకుపోయి, ప్రయివేటుపరం చేసే దిశగా పాలకులు ఆలోచిస్తున్న తరుణంలో ఆ సంస్థ ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, ప్రయాణికులు, రాజకీయ పార్టీలు ప్రముఖంగా సీపీఐ(ఎం), దాని అనుబంధ సంఘాలు ధర్నాలు, రాస్తోరోకోలు, ఆందోళనలు, వంటావార్పు, విధుల నుంచి వెళ్లకుండా పనిచేయడం వివిధ రూపాల్లో పోరాటాన్ని కొనసాగించి ఆర్టీసీ ప్రయివేటీకరణ ఆలోచనను ప్రభుత్వం విరమించుకునేలా విజయవంతం అయ్యారనే చెప్పాలి. మరోవైపు డైనమిక్ ఐపీఎస్, వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టడంతో ఆర్టీసీపై ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందేలా వినూత్న కార్యక్రమాలు చేపట్టి సక్సెస్ అవుతున్నారు. ''ఆర్టీసీలో ప్రయాణించండి, సురక్షితంగా గమ్యానికి చేరండి'' అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఈమెయిల్, వాట్సాప్, ట్విటర్ వేదికల ద్వారా వస్తున్న ఫిర్యాదులపై కూడా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అదే సందర్భంలో ఆర్టీసీ అప్పుల ఊబినుంచి బయట పడాలంటే ఆ సంస్థ ఆధీనంలో ఉన్న వనరులు కూడా పూర్తిస్థాయిలో ఉపయోగ పడాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఖాళీ స్థలాలను, బిల్డింగ్‌లను అద్దెకు ఇవ్వడం లాంటివి సైతం చేయాలని పలువురు కోరుతున్నారు.
ఎందుకు రావడం లేదు?
హయత్‌నగర్‌లోని ఆర్టీసీ భవనంలోకి ఏడేండ్ల నుంచి ఎవరూ అద్దెకు రాకవపోడానికి కారణాలపై అధికారులు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో విశ్లేషకులు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అద్దెకు రాకపోవడానికి ప్రధాన కారణం, తగిన పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, భవన నిర్వహణపై అధికారిక చొరవలోపించడం, ప్రజా ప్రతినిధులకు, ఆర్టీసీ అధికారులు ఎక్కువగా పట్టించుకోకపోవడం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ చైర్మెన్‌గా బాధ్యలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి ఆర్సీటీ మనుగడకు, ప్రజల్లో చైతన్యం కోసం ఏనాడూ ఒక కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా ప్రజా రవాణా అయిన ఆర్టీసీని ప్రజా ప్రతినిధులైతే పెద్దగా పట్టించుకోవడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే విధంగా ఆర్టీసీకి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం కూడా అందించాలని, రాయితీలకు, సంబంధించిన సొమ్మును చెల్లించాలని, నష్టాల నుంచి బయటపడేందుకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఇక హయత్‌నగర్ ఆర్టీసీ భవన్‌పై ఎండీ సజ్జనార్ ప్రత్యేక చొరవ చూపితే ఈ భవనం అద్దెకుపోయి కొంతలో కొంత మేలు జరుగుతుందని హయత్‌నగర్ డిపో అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది అయినా హయత్‌నగర్ ఆర్టీసీ భవనం ఆదాయ వనరుగా మారి, అప్పుల ఊబిలోంచి బయటపడేందుకు తోడ్పడుతుందో లేదో చూడాలి మరి.
రెంట్‌కు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం
హయత్‌నగర్‌లోని మూడంతస్లు ఆర్టీసీ భవనాన్ని అద్దెకు ఇచ్చేందుకు అంతా సిద్దం చేశాం. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించాం. ప్రభుత్వ లైసెన్స్ కలిగిన ఏ వ్యాపారం అయినా సరే అద్దెకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం. పూర్తి వివరాలకు 9959226138,7382804822 నెంబర్లను సంప్రదించవచ్చు.
-డీవీఎం పీవీజీ రాజు