Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావును సన్మానించిన ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు
నవతెలంగాణ-అడిక్‌మెట్
వైద్యారోగ్య శాఖలో ఎస్సీలకు 16 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న, వంగపల్లి శ్రీనివాసులు అన్నారు. గురువారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారత కోసం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, విప్లవాత్మకమైన దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో దళితుల అభ్యున్నతి కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారని అన్నారు. ఎస్సీలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో తెలంగాణ సర్కారు రిజర్వేషన్లు కల్పిస్తుందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలో భాగంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ని నిర్వీర్యం చేయాలని, దళిత పరిశోధక విద్యార్థులకు యూనివర్సిటీలలో ఫెలోషిప్‌లు లేకుండా చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్స్ అమలుకాకుండా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అనేక ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి వాటిని అంబానీ, ఆదాలకు, కార్పొరేట్ కంపెనీలకు గుండుగుత్తగా అమ్మడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో దళిత సాధికారత కోసం చేస్తున్న కృషిని చూసి కేంద్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లేష్, చిలకమర్తి గణేష్, యువసేన అధ్యక్షులు రమేష్, మహిళ అధ్యక్షులు రుక్కమ్మ, జోగు దశరథ్, కోర్ కమిటీ సభ్యులు నాగారం బాబు, విద్యార్ది నాయకులు చందు, రాజేష్, తిరుమలేష్, నాగరాజు, శ్రీకాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.