Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ-సరూర్నగర్
వీఎం గురుకులాలను అత్యుత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ గురుకుల పాఠశాల విద్యార్థుల కోసం వైద్య ఆరోగ్యశాఖతో కలిసి అపోలో హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని, రుద్రమదేవి ఆత్మరక్షణ, స్వ రక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే, యోగ, జిమ్నాస్టిక్ శిక్షణా తరగతులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పోలీస్ గృహనిర్మాణ సంస్థ చైర్మెన్ కోలేటి దామోదర్ గుప్త, ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్ డాక్టర్ గీతారాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనాథలు, పేద వర్గాల బాలబాలికలకు ఆశ్రయం కల్పించడంతో పాటు చదువు చెప్పేందుకు నిజాం మహబూబ్ అలీ ఖాన్ 1903లో నెలకొల్పినట్టు తెలిపారు. గురుకు లంలో ప్రస్తుతం ఆరు వందల మంది బాలబాలికలు ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఈ స్కూల్లో మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపరుస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సామాజిక బాధ్యతతో సేవా భావంతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఇలాంటి వైద్య శిబిరం నిర్వహించడం ద్వారా పిల్లల్లోని సమస్యలను ముందస్తుగా గుర్తించవచ్చు అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అంతకుముందు మంత్రి శాసనసభ నుంచి వీఎం వరకు మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీపార్వతి, ప్రముఖ వైద్యులు రవీంద్రబాబు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.