Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
మేడ్చల్-మల్కాజిగిరి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా కమిటీ అధ్యక్షులు మొక్క ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పల బాల నర్సయ్య ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చైర్మెన్ పావని జంగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై చలో ఢిల్లీ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు రూ.3 వందల నుంచి రూ.3 వేల పింఛన్ పెంచాలనీ, వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 ప్రకారం నాలుగు శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా పటిష్టంగా అమలు చేయాలనీ, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మార్చి 28న ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహిస్తోందని ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటరీ పక్ష నేతలు సదస్సుకు హాజరు అవుతారనీ, సీఎం కేసీఆర్‌తోపాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వికలాంగుల పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచాలని ప్రధాని మోడీకి లెటర్లు రాయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల పట్ల వివక్ష కొనసాగిస్తుందనీ, ఇందిరమ్మ జాతీయ పెన్షన్ పథకం ద్వారా సవతి తల్లి ప్రేమ నటిస్తూ కేవలం నామమాత్రంగా రూ.300 మాత్రమే ఇస్తుందనీ, అది కూడా అరచేతిలో పోసి మోచేతితో తాగవనట్టు 80 శాతం వైకల్యం ఉన్న వారికే పరిమితం చేసిందనీ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో తెలంగాణ 5 లక్షల ఫించన్ దారుల్లో 4 లక్షలా 27 వేల మందికి అన్యాయం జరుగుతుందనీ, కేంద్ర వికలాంగుల చట్టం 2016 ప్రకారం 40 శాతం వైకల్యం ఉన్న అందరికీ ఈ పథకం ద్వారా రూ.3 వేలకు పెంచాలనీ, 4శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కాగితాలకే పరిమితం కాకుండా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో ఖచ్చితంగా అమలు చేయాలని స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు వరకు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా తలపెట్టిన చలో వికలాంగుల ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి తరలి రావాలని పిలుపునిచ్చారు. చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ వికలాంగులు కేంద్ర ప్రభుత్వం ఫించన్ రూ.3 వేలకు పెంపునకు, ఉద్యోగ రిజర్వేషన్లు 4శాతం అమలు చేయడానికి వికలాంగులు అంతా కలిసి ఢిల్లీకి బైలుదేరుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా వారికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవి మహిపల్ గౌడ్, కడుపొల్లా మల్లేష్, బేతల నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.