Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్చి28,29 తేదీల్లో కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం ఆయాచోట్ల జరిగిన కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు
మహరాజ్గంజ్లో...
నవతెలంగాణ-హైదరాబాద్/హయత్నగర్/జగద్గిరిగుట్ట/దుండిగల్
కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు కార్మికులంతా ఐక్యంగా నిలవాలని సీఐటీయూ సౌత్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం. మీనా అన్నారు. ఈనెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా మహరాజ్గంజ్లో హమాలీ కార్మికులతో కలిసి సమ్మె పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం ఆగదన్నారు. సమ్మెలో పాల్గొని ప్రభుత్వాలకు ఆ విధమైన హెచ్చరిక చేద్దామన్నారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.సాయిలు, కోశాధికారి జి. నర్సింహ్మ, స్థానిక నాయకు పి.కురుమయ్య, ఎం వెంకటేశ్, సిద్ధులు, హమాలీలు, ఆటో డ్రైవర్లు, షాప్ గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు
హయత్నగర్ పరిధిలో...
దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అందరూ ఖండించాలని కోరారు. కార్మికుల చట్టాలను రద్దు చేయడం హేయమైన చర్య అన్నారు. ఈ చట్టాల రక్షణ కోసం కార్మికులు ఉద్యమించాలన్నారు. కార్మికులను బానిసలుగా మార్చేలా ఉన్న లేబర్ కోడ్లను కేంద్ర సర్కారు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు కార్మికులను బానిసలుగా మార్చే కుట్రలు చేస్తోందన్నారు. ఇలాంటివి కార్మికలోకం చూస్తూ ఊరుకోదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల కార్మికుల జీతం 30 శాతం పెంచినట్టు 8 నెలల కిందట చెప్పిందని, ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులకు పెంచిన జీతం వెంటనే అమలు చేయాలన్నారు. పదవీ విరమణ అనంతరం రూ. 10 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగాల విధ్వంసం చేసే చర్యలు ఆపాలి
నవతెలంగాణ-ధూల్ పేట్
ప్రయివేటీకరణతో ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం నిలిపి వేయాలని సీఐటీయూ సౌత్ జిల్లా అధ్యక్షులు ఎం. శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ నెల 28, 29 దేశవ్యాప్త సమ్మెను అన్ని కార్మిక సంఘాలు కలిసి విజయవంతం చేయాలని కోరారు. వివిధ కంపెనీలు, షోరూమ్ల కార్మికులు, హమాలీలతో కలిసి సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు.కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న బాలప్ప, జి నరసమ్మ, నాగయ్య, ఆహెత్ ఖాన్, గోపాల్, అంజి తదితరులు పాల్గొన్నారు.
కార్మిక చట్టాల రద్దుతో తీవ్ర అన్యాయం
పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరుగకుండనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం 29 కార్మికచట్టాలను రద్దు చేసి కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఏఐటీయూసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ యూసుఫ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 28, 29 తేదీలలో నిర్వహించే దేశ వ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఏఐటీయూసి కార్యాలయంలో సమ్మె వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లను కేంద్రం వెంటనే రద్దు చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 5 కనీస వేతనాల జీవోలను గెజిట్లో ప్రింట్ చేసి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మిగిలిన షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ జీవోలను విడుదల చేయాలన్నారు. కనీస వేతనం 26 వేలకు పెంచి కాంట్రాక్టు ఉద్యోగులందరికి గుర్తింపు కార్డులు ఇచ్చి, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలన్నారు. న్యాయమైన డిమాండ్లతో తలపెట్టిన ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు హరినాథ్రావు, కార్యదర్శి కె.స్వామి, నాయకులు సుంకిరెడ్డి, రాములు, రామకృష్ణ, పవన్, శ్రీనివాస్, నర్సయ్య, చంద్రమౌలి, పి.నర్సింహులు, ఎం.నర్సింహులు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట్లో..
మార్చి 28 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగస్వాములం అవుతామని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. గురువారం మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శంకరయ్యను కలిసి సమ్మె సమ్మెనోటీసు అందజేశారు. సీఐటీయూ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం. చంద్రశేఖర్, ఏఐటీయూసీ మండల నాయకులు పి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, అందుకోసం కార్మికులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షులు పెంటయ్య, నాయకులు జై వెంకన్న, జైపాల్, సీఐటీయూ నాయకులు ఎన్. బాలు, ఏఐటీయూసీ నాయకులు ఆనంద్, దిలేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.