Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.వెయ్యి కోట్లతో నాళాల అభివృద్ధి
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్‌పేట
రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యను పరిస్కారం చేయడానికి ప్రణాళికా బద్ధంగా నిధులు మంజూరు చేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని 27వ వార్డులో మిషన్ భగీరథ పథకంలో రూ.7 కోట్లతో నిర్మించే 60 లక్షల లీటర్ల కెపాసిటీ గల మంచినీటి రిజర్వాయర్, పైప్ లైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి రూ.207 కోట్ల నిధులు మంజూరు చేసిందనీ, అందులో జలపల్లి మున్సిపాల్టీకి రూ.72 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని శివారు పట్టణాల తాగు నీటి అవసరాలు తీర్చటానికి సీఎం కేసీఆర్ రూ.1200 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. వర్షాలకు వచ్చే వరద నీరు సాఫీగా వెళ్లటానికి నాళాల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించారనీ, అందులో జల్పల్లి మునిసిపాలిటీకి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయగా ఆ నిధులతో వరద కాల్వల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. పేదలదరికే వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు జల్పల్లి మున్సిపాల్టీకి 4 బస్తీ దవాఖానాలను మంజూరు చేశారనీ, పహాడి షరీఫ్, కొత్తపేట, శ్రీరామ్ కాలనీ, షాహీన్ నగర్లో వాటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాక్సిన్‌తో పాటు అన్ని రకాల వైద్య సేవలు లభిస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 288 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రతిపాదించినట్టు తెలిపారు. వాటితో పాటు పల్లె దవాఖానాల ఏర్పాటుకు కూడా నిర్ణయం చేశామన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్నారు. ప్రయివేట్, కార్పొరేట్క ధీటుగా నూతన హంగులను సమకూరుస్తూ బడుల రూపురేఖలు మార్చటానికి చేపట్టిన బహత్తర కార్యక్రమని పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థి ప్రపంచంతో పోటీ పడేలా, దేశ, విదేశాల్లో ఎక్కడకు వెళ్లినా రాణించేలా ప్రభుత్వ బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంబించనునట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి పురపాలక సంఘం కమిషనర్ డా.ప్రవీణ్ కుమార్, చైర్మెన్ అబ్దులా సాది, వైఎస్ చైర్మెన్ పర్హానా నాజ్, కౌన్సిలర్లు కె.లక్మినారాయణ, పి.శంకర్, షేక్ పమీదా అఫ్జల్, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎక్బాల్ ఖలీఫా, కో-ఆప్షన్ సభ్యులు సురెడ్డి కృష్ణారెడ్డి, మాజీ ఆర్మీమెన్, మున్సిపల్ మీడియా ఇన్చార్జి వాసుబాబు, పార్టీ నాయకులు, వాటర్ వర్క్స్, రెవెన్యూ, మున్సిపల్్ అధికా రులు, కార్యకర్తలు పాల్గొన్నారు.