Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు కమీషనరేట్లకూ ప్రోగ్రాం మేనేజర్లు
- అందరూ కలిసి కట్టుగా పని చేయాలి
- 'సేఫ్ సిటీ ప్రాజెక్టు' సమావేశంలో సీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిటీలో మహిళల భద్రతకు మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలనీ, లైంగిక వేధింపులు, గృహహింస వంటి కేసులపై వెంటనే స్పందించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని అన్ని మెట్రో నగరాల మాదిరిగానే హైదరాబాద్లో మహిళా భద్రతను పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన పాలన, విధానపరమైన అంశాలపై చర్చించేందుకు గురువారం సిటీ పోలీస్ కమిషన రట్లో సీపీ అధ్యక్షతన సమావేశం జరిగింది. మహిళలు, బాలికల భద్రత విషయంలో సీపీ సీవీ ఆనంద్ పలు సూచనలను చేశారు. బహిరంగ ప్రదేశాల్లో నేరాల కట్టడిని నియంత్రించడం, సురక్షిత వాతావరణాన్ని కల్పించడం. లింగపరమైన హింస, వేధింపులు లేకుండా చేయడం, మహిళలు, బాలికలు నిర్భయంగా ఉండే వాతావరణం కల్పించడం వంటి అవకాశాలు కల్పించడానికి కేంద్ర మంత్రిత్వశాఖ ద్వారా ప్రారంభించిన సేఫ్ సిటీ ప్రాజెక్టు ప్రాధాన్య తను వివరించారు. దీని అమలుకు, అవసరమైన సౌకర్యాల కల్పనకు కావాల్సిన నిధులను నిర్భయ నిధి ద్వారా అందుతాయని తెలిపారు. నగరాల్లో మహిళలకు రక్షణ కల్పించడంలో సేఫ్ సిటీ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడానికి అందరూ కలిసి కట్టుగా పని చేయాలన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరే ట్లకు అవసరమైన ప్రోగ్రామ్ మేనేజర్లను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీతో కలిసి మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు, నిఘా వ్యాన్ల ఏర్పాటు, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవరమెంట్కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. బడ్జెట్ పరమైన అంశాలు, సీసీ టీవీల సేకరణ వంటి అంశాలను చర్చించారు. ఈ సమా వేశంలో అదనపు డీజీ (విమెన్ సేఫ్టీ వింగ్) స్వాతి లక్రా, సైబరా బాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, అడిషనల్ సీపీ డి.ఎస్.చౌహాన్, జీహెచ్ఎంసీ అడిషనల కమిషనర్ ప్రియాంక, జనరల్ మేనేజర్ పుష్పరాథోడ్, జాయింట్ సీపీ (అడ్మిన్) ఎమ్.రమేశ్, క్రైమ్ విభాగం అడిషనల్ సీపీ ఏ ఆర్ శ్రీనివాస్ సిట్, ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీ ఎవి.రంగనాథ్, సీసీఎస్ సీపీ గజరావు భూపాల్, తదితరులు పాల్గొన్నారు.