Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
మూసివేసిన హనుమాన్ దేవాలయాన్ని తెరవాలని, భక్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శనివారంనాడు తిరుమలగిరి లాల్ బజార్లో భక్తులు ఆందోళనకు దిగారు. మిలిటరీ అధికారులు మూసివేసిన హనుమాన్ ఆలయం వద్ద నిరసన ప్రదర్శించారు. రోడ్డుపై రాస్తారోకో చేశారు. వందల సంవత్సరాల నాటి పురాతన హనుమాన్ ఆలయాన్ని మిలటరీ అధికారులు గత రెండు సంవత్సరాల క్రితం మూసివేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలం ఆలయంలో దర్శించుకునేందుకు చిన్న గేటు ఉండేదని, ఆ గేటు ద్వారానే భక్తులకు అనుమతించేవారని, గత సంవత్సరం అనగా ఆ గేట్లు మూసివేసి భక్తులను ఆలయంలోనికి పోనీయకుండా చేశారని స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత రెండు సంవత్సరాల నుండి కూడా ఆలయాన్ని మూసివేసిన అధికారులు అరాచకం చేస్తున్నారని ఎంతో రంగరంగ వైభవంగా పూజలందుకునే హనుమాన్ ఆలయాన్ని మూసివేయడంతో భక్తజనం అంతా కలిసి గుడి తలుపులు తెరవాలని లాల్‌బజార్ చౌరస్తాలో రాస్తారోకో చేసి ర్యాలీ కూడా నిర్వహించారు. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి ఇక్కడ జరుపుకోవాలని భక్తులు నిశ్చయించుకున్నారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సాయన్న అసెంబ్లీలో లేవనెత్తినా కూడా స్థానిక లీడరు,్ల అధికారులుగానీ పట్టించుకోవట్లేదని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రెటరీ ప్రవీణ్ గౌడ్, ట్రెజరర్ అశోక్ మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఆలయాన్ని తెరవాలని నినాదాలు చేశారు.