Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ కార్మికుల అడ్డాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి: ఐఎఫ్టీయూ
నవతెలంగాణ-ఓయూ
కేంద ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఎస్.ఎల్. పద్మ, ఉపాధ్యక్షులు ఎం. హన్మేష్ డిమాండ్ చేశారు. మార్చి 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం వారాసిగూడ, చిలుకలగూడ కార్మిక అడ్డాల వద్ద ప్రచారం చేశారు. భవన నిర్మాణ కార్మికుల అడ్డా కేంద్రాలలో కార్మికులకు కనీస అవసరాలను తీర్చడానికి బస్ షెల్టర్లనూ, నీటి సౌకర్యాలను, శోచాలయాలనూ ఏర్పాటు చేయాలని ప్రచారంలో డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులపై ముప్పేట దాడికి దిగిందని, 56 చట్టాలను క్రోడీకరించి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక హక్కులను కాలరాస్తోందని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా శ్రమదోపిడీకి గురి చేస్తున్నారని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. నాగేశ్వరరావు, బి. రాము, నగర అధ్యక్షులు ఎస్. అనిల్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు క్రిష్ణ పాల్గొన్నారు.