Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
- సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రమోహన్
నవతెలంగాణ-హస్తినాపురం
హస్థినాపురం డివిజన్ పరిధిలో గల పోచమ్మ దేవాలయం దగ్గరలో మున్సిపల్ కార్మికులతో ఈ నెల 28 మరియు 29 తేదీలలో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కరపత్రాలతో ప్రచారం చేయడం జరిగింది. అనంతరం మున్సిపల్ కార్మికుల తో సీఐటీయూ ఎల్బీనగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి అధ్యక్షతన గ్రూప్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రమోహన్ మాట్లాడుతూ..కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక కార్మిక చట్టాలను రైతు చట్టాలను కాలరాస్తూ హక్కులు లేకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం ఈనెల 28 మరియు 29 దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని రెండు రోజుల సమ్మె జయప్రదం చేయాలని కోరారు. వివిధ రంగాల్లో వివిధ సంస్థల కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులకు ధరలకు అనుకూలంగా కనీస వేతనాల జీవోలను ప్రభుత్వాలు అమలు చేయలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వచ్చాక కార్మిక 44 చట్టాలతో పాటు నాలుగు లేబర్ కోడ్లు ప్రవేశ పెట్టారని, వెంటనే వాటి రద్దు చేయాలని అన్నారు. కేంద్రం 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటలకు పెంచాలని భావిస్తుందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడంతో పాటు ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందన్నారు. మున్సిపల్ పరిధిలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న పారిశుధ్య వాటర్ వర్క్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కేటగిరీల వారీగా పదకొండవ పీఆర్సీ కమిషన్ చైర్మెన్ సిఫారసు చేసిన వేతనాలను పెంచాలని, పలు రకాల ప్రమాదాల్లో మరణిస్తున్న కార్మిక కుటుంబాలకు వారికి 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మిక పిల్లలకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లతో పాటు. ఉన్నత చదువులకు ప్రోత్సాహం కల్పించే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రవేశ పరీక్షలకు కోచింగ్ వసతుల లాంటి ఉచిత సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
కార్మికులు ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు వీరయ్య, వెంకన్న, లక్ష్మణ్, నవీన్, వెంకన్న, శంకర్, బాబు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.