Authorization
Tue March 18, 2025 11:33:15 pm
నవతెలంగాణ-కాప్రా
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈసీఐఎల్ కమలానగర్ చౌరస్తాలో ఐద్వా ఆధ్వర్యంలో సిలిండర్ కట్టెల పొయ్యితో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.వినోద మాట్లాడుతూ ప్రజలు ఊహించినట్టుగానే ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే పెట్రోల్ డీజిల్ రూపాయి, గ్యాస్ రూ.50 పెంచి సామాన్యుల బతుకులు ఛిద్రం చేశారన్నారు. దేశంలో ప్రజలు వాడుకునే వస్తువుల నేటికీ ధరలు పెరిగి కొనలేని తినలేని పరిస్థితులు దాపురించాయన్నారు. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కరోనా అనంతర కాలంలో ఉపాధి లేక కనీస పనికి కనీస వేతనం లేక ప్రజల చేతిలో చిల్లిగవ్వ లేక పెరుగుతున్న ధరలను చూస్తే సామాన్యులు బతకలేని స్థితిలోకి నెట్టబడ్డారన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆదికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద, మధ్యతరగతి ప్రజలను ధరలతో ఇబ్బందులు పెడుతూనే ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ధరలు తగ్గించే వరకు పోరాటం చేస్తామన్నారు. అనేక సమస్యలను పరిష్కారం చేసుకోవడంలో మహిళల పాత్ర ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు శారద, శోభ, గౌసియా, సుశీల, శ్రీలత, మాధవి, జోష్ణ, చైతన్యలత, లక్ష్మి, మంజుల పాల్గొన్నారు.