Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలల్లో (కేజీబీవీ) తొలగించిన 933 మంది టీచర్లను సర్వీసులో కొనసాగించి, బకాయి ఉన్న ఆరు మాసాల వేతనం, నియామక ఉత్తర్వులు ఇప్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీల వెంకటేష్ ముదిరాజ్ అధ్యక్షతన గురువారం బషీర్ బాగ్‌లోని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ఎదుట బాధితులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్.కష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో 17.11.2021న నిబంధనల మేరకు కాంట్రాక్టు పద్ధతిన నియమించబడిన 620 పీజీ టీచర్స్, 317 స్కూల్ టీచర్స్, 42 పీఈటీలను విధులకు హాజరు కావద్దని మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం అత్యంత దారుణమన్నారు. కేజీబీవీలలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులతో సమానంగా వేతనం రెగ్యులర్‌గా ఇస్తామని నియామకం చేసి ఇప్పుడు 6 మాసాలు గడిచిన వేతనాలు చెల్లించకుండా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం కాంట్రాక్టు పద్ధతిన నియమించుకున్న టీచర్లను విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు పరీక్షలు జరుగుతున్న తరుణంలో వీరిని తొలగిస్తే విద్యార్థులకు రివిజన్ పాఠాలు ఎవరు చెపుతారని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ, అభిమానం చూపాలి తప్ప నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత గల విద్యా ప్రమాణాలు కలిగిన విద్య పేద వర్గాలకు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ శ్రద్ధ తీసుకుంటుంటే విద్యా శాఖ అధికారులు మాత్రం టీచర్లను తొలగించుకుంటూ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. మానవతా దక్పథంతో పరిశీలించి 937 మంది కేజీబీవీ టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, బకాయి ఉన్న 6 మాసాల వేతనాన్ని మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కష్ణ, నాయకులు వేముల రామకష్ణ, సి.రాజేందర్, ఆనందయ్య, చంటి ముదిరాజ్, బబ్లూ గౌడ్, దీపిక, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.