Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం
- దళితబంధు దేశానికే ఆదర్శం
- దళితులను ధనవంతులను చేయడమే లక్ష్యం
- రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద చేయూతనిస్తూ దళితులను అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహిస్తోందనీ, ఈ విషయంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కలలను సాకారం చేసే దిశలో పయనిస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం కీసర మండలం చీర్యాల గ్రామ సమీపంలోని జయమోహన్ గార్డెన్స్‌లో దళితబంధుకు అర్హులైన 95 మందికి ట్రాక్టర్లు, గూడ్స్, ఆటోలు, ఇతర వాహనాలను కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి అందజేశారు. మొదటగా ట్రాక్టర్ తాళాలను కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను దళితులతో పాటు ఎస్టీ, బీసీలు, మైనారిటీలు అభివృద్ధి చెందాలన్న కలలను నిజం చేస్తోందన్నారు. అభ్యున్నతికి, ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తోందన్నారు. దళితబంధు దేశానికే కాకుండా ప్రపంచానికే మార్గదర్శమన్నారు. నేడు దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నామని తెలిపారు. దళితబంధు యూనిట్లను లబ్దిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ పథకం కింద అర్హులైన దళితులందరికీ రూ.10 లక్షలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయనీ, ఆ డబ్బులతో 40 రకాల వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు మంచి అవకాశం ఉందని తెలిపారు. దళితులను ధనవంతులను చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. దళితులను గత పాలకులు చిన్నచూపు చూసేవారనీ, తమ ప్రభుత్వ హయాంలో వారికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ వారందరినీ ధనవంతులు, రాజులుగా చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రెండో విడత దళితబంధు పథకం కింద రూ.17 వేలా 700 కోట్లను బడ్జెట్లో ప్రవేశపెట్టినట్టు తెలిపారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలైన విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా నిర్వహిస్తున్నామనీ, వారికి నాణ్యమైన విద్యనందించడంతో పాటు అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటు పాఠశాలలకు దీటుగా విద్యనందించేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అందుకుగాను రూ.7,331 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ దళితబంధు ఎంతో గొప్ప కార్యక్రమం అన్నారు. ఈ దళితబంధు ద్వారా అట్టడుగు స్థాయిలో, ఆర్థికంగా ఎదుగుదల లేని వారిని అభివృద్ధిపథంలో పయనించేందుకు రూపొందించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా దళితబంధు పథకానికి ఎంతో విశిష్టత సంతరించుకుందనీ, పేదరిక వ్యవస్థను నిర్మూలించి దళితులను ఉన్నత స్థితిలో నిలిపేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ దళితులకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని అన్ని రంగాల్లో అభివద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో పని చేస్తున్నారని తెలిపారు. దళితబంధును అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, ఆర్డీవోలు రవి, మల్లయ్య, నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, బొడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, ఫీర్జాదిగూడ మేయర్ వెంకట్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.