Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సాంస్కతిక కార్యక్రమాలకు ప్రసిద్ధి పొందిన శ్రీత్యాగరాయ గాన సభ మూడు అనుబంధ మందిరాలు గ్రంథావిష్కరణ, శాస్త్రీయ కళా ప్రదర్శనలకు ఉచితంగా సంస్థలకు అందుబాటులో ఉంచగా, సోమవారం నుంచి ప్రధాన వేదికను కొన్ని నియమ, నిబంధనలతో వివాహ కార్యక్రమాలకు ఉచితంగా అందించనున్నారు. ప్రారంభోత్సవంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ పాల్గొని మాట్లాడుతూ సాంస్కతిక కేంద్రంగా విలసిల్లుతున్న గాన సభలో అన్ని కులాల పేదలకు కల్యాణ వేదికగా ఉచితంగా అందివ్వటం గానసభ ఉన్నతికి మరో మెట్టు అని అభినందించారు. ఈ కార్యక్రమం గానసభ పూర్వ అధ్యక్షులు కళా సుబ్బరావు జయంతి సందర్భంకావటం శాశ్వతంగా ఆయన సేవలు నిలిచిపోతాయని కొనియాడారు. శాసన సభ్యుడు ముఠా గోపాల్, బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళ భరణం కష్ణ మోహన రావు మాట్లాడుతూ బడుగు బలహీన వెనుక బడిన కులాల వారు వేలు ఖర్చు పెట్టి నా కల్యాణ వేదికలు దొరకని పరిస్తుతులు ఉన్న నేపథ్యంలో ఉచితంగా గానసభ వేదికను అందించే ఆలోచన పేదలకు పెన్నిధి వంటిదని కొనియాడారు. శాసన మండలి పూర్వ సభ్యుడు రామచంద్ర రావు, దేవీ ప్రసాద్, ప్రముఖ కవి ఆచార్య కొలకలూరి ఇనాక్ గాన సభ సాంస్కతిక సేవతో పాటు సామాజిక సేవలోను ముందునిలవటం అభినందనీయమన్నారు. గానసభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి తమ స్వాగత ఉపన్యాసంలో కల్యాణ వేదిక ఉచితంగా అందించేందుకు రూపొందించిన నియమాలు వివరించారు. వేదిక అలంకరణ, కుర్చీలు తివాసీలు వంటి సదుపాయాలు అందిస్తామని ఎవరైనా దాతలు స్పందిస్తే ఉచితంగా వివాహ సుభ సమయంలో భోజనం సదుపాయం కూడా ఉచితంగా అందించగలమని తెలిపారు. వేదిక పై చక్రపాణి, శంకర నారాయణ, ఉష , విజరు కుమార్, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొని గోడ పత్రిక అవిష్కరించారు.