Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సునీతా రావు
- మోజాంజాహి మార్కెట్ చౌరస్తా వద్ద నిరసన
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్/జగద్గిరిగుట్ట
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సునీతారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ సోమవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోజాంజాహి మార్కెట్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు భుజాన ఖాళీ గ్యాస్ సిలిండర్లు పెట్టుకుని నిరసన తెలిపారు. 'పీఎం ఝాటా., సీఎం ఝాటా.. దోనో మిల్కే దేశిక లూరా' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సునీతారావు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్‌పై సబ్సిడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మోజాంజాహి మార్కెట్ ప్రధాన చౌరస్తాలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో నలువైపులా ట్రాఫిక్ ఎక్కడికి అక్కడే స్తంభించిపోయింది. బేగంబజార్ మహిళా పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకు ముందు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో గాంధీ భవన్ నుంచి ర్యాలీగా మోజాంజాహి మార్కెట్ వరకూ ఊరేగింపుగా తరలివచ్చారు. నిరసన అనంతరం నడుచుకుంటూ తిరిగి గాంధీభవన్‌కు తరలివెళ్లారు.
మహిళా సమాఖ్య నాయకుల ఆధ్వర్యంలో
పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని మహిళా సమాఖ్య నియోజకవర్గం అధ్యక్షులు ఉజ్జిని హైమావతి డిమాండ్ చేశారు. సోమవారం జగద్గిరిగుట్ట డివిజన్లో పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజు రోజుకు ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. క్రూడ్ అయిల్ ధరలు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ బడుగుల పొట్టకొట్టి పెద్దలకు సద్దులు మోస్తూ ప్రయివేటు పెట్టుబడి దారులకు పంచన చేరి దేశ కా చౌకిదార్ అన్న వారే నేడు ధనికులకు కాపాలదార్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. మహిళల అభ్యున్నతికి పాటుపడతానన్న వ్యక్తి వంట గ్యాస్ ధరలు పెంచి మహిళల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. రాబోయె రోజుల్లో తగిన బుద్ది చెప్పుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కె.యేసురత్నం, మహిళా సమాఖ్య నాయకులు గోవిందమ్మ, జయమ్మ, ఉమ, మల్లమ్మ, స్వరూప, గోవిందమ్మ, నాగమణి, అనిత, లక్ష్మి, చంద్రమ్మ, ఏఐటీయూసీ నియోజకవర్గం అధ్యక్షులు ఉజ్జిని హరినాధరావు, సీపీఐ నాయకులు ప్రవీణ్, శ్రీనివాస్, ముసలయ్య, స్యామేల్, చంద్రయ్య పాల్గొన్నారు.