Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి
- నూతన విద్యావిధానం రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
- ఘనంగా హైదరాబాద్ జిల్లా మహాసభలు
నవతెలంగాణ-ముషీరాబాద్
విద్యారంగంలో బీజేపీ పాలనలో మతోన్మాద విధానాలు అత్యంత ప్రమాదకరం అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా 41వ మహాసభలు జిల్లా అధ్యక్షుడు కె అశోక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ప్రారంభ సభలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ నూతన విద్యావిధానం పేరుతో దేశంలో విద్యను పాఠశాల స్థాయిలో కార్పొరేటీకరణ, కేంద్రీకరణకు పాల్పడుతున్నారని, పురాణాలు, వాస్తు, జ్యోతిష్య శాస్త్రం తీసుకుని వస్తూ విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అని అన్నారు. దేశంలో పాఠశాల రంగంలో లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయకుండా పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగానికి నిధులు కేటాయించకుండా, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా, తాత్సారం చేస్తుందని అన్నారు. విద్యారంగాన్ని కాపాడేందుకు ఎస్ఎఫ్ఐ మరిన్ని పోరాటాలు చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లడుతూ నూతన విద్యావిధానం పేరుతో దేశంలో బీజేపీ ప్రభుత్వం యూనివర్సిటీలను, ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే కుట్రచేస్తుందని అన్నారు. నూతన విద్యావిధానం రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. దేశంలో స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా యూనిర్సిటీ విద్యార్థులు పోరాటం చేసిన సందర్భంలో పోలీసులు అరెస్టులు లేవని కానీ నేడు క్యాంపస్లలో పోలీసులు చేత అరెస్టులను చేయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని, గురుకులాలు, హాస్టల్స్ మెస్ చార్జీలు పెంచాలని, సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు 'స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం' జెండాను జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా నిర్మాణ, కార్యకలపాల నివేదికను జిల్లా కార్యదర్శి ఎం.డి.జావేద్ ప్రవేశ పెట్టారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి గా లెనిన్ గువేరా, అశోక్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా అనూష, నాగేందర్, శ్రీమన్, సాగర్, సహాయ కార్యదర్శులుగా వీరేందర్, సునీల్, ప్రశాంత్ ఎన్నికయ్యారు.