Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాష్ట్రంలోఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అర్హత సర్టిఫికెట్ల జారీలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో అర్హత గల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు ఆరోపించారు. సోమవారం హిమాయత్‌నగర్ లోని ఓసీ సమాఖ్య కార్యాలయంలో రాష్ట్ర ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అర్హతకు నియమ నిబంధనలతో కూడిన జీవో ఎంఎస్ నెంబర్ 244 ను 2021 ఆగస్టు-24న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అధికారుల నిర్లక్ష్యంతో అర్హత గల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సర్టిఫికెట్లు పొందక విద్యా, ఉద్యోగ విభాగాల్లో అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 వేలకు పైగా వివిధ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుండగా అర్హత గల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అధికారులు అర్హత సర్టిఫికెట్లను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జారీ చేయక తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, దీంతో నిరుద్యోగులు తీవ్రంగా గందరగోళానికి గురై అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అర్హత జీవో 244ను అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న సీఎస్ సోమేష్ కుమార్‌పై సీఎం కేసీఆర్ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అర్హత జీవో 244ను వారంలోగా అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, తహసీల్దార్ లకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తగిన కార్యాచరణతో ఉధృతంగా ఉద్యమించి ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఓసీ ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు చెన్నమనేని పురుషోత్తమరావు, బుస్సా శ్రీనివాస్, కార్యదర్శులు తాడిశెట్టి పశుపతి, జూపల్లి పథ్వీదర్ రావు, సారాబుడ్ల రాజిరెడ్డి, రెడ్డి సంఘాల రాష్ట్ర కన్వీనర్ చందుపట్ల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.