Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కూకట్పల్లి
పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరం లాంటివని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో 103 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన డబ్బులకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇప్పటివరకు నియోజకవర్గంలో 15 వేల మందికి లబ్దిదారులకు చెక్కులు అందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందాయని చెప్పారు. దేశంలో మరెక్కడా పేదింటి ఆడపిల్లలను ఆదుకునే పథకాలు లేవన్నారు. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. పింఛన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం 19 వందలు ఇస్తుంటే కేంద్రం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తోందన్నారు. బీజేపీ నాయకులు అబద్దాలు మాని, అభివృద్ధికి సహకరించాలన్నారు. చేతనైతే అభివృద్ధి పోటీ పడాలన్నారు. దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో, తెలంగాణలో ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుందని చెప్పారు. దేశమంతా కరెంట్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే టీఆర్ఎస్ పాలనలోని తెలంగాణలో మాత్రమే ఆ సమస్య లేదన్నారు.