Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఎల్లమ్మబండ నుండి కేపీహెచ్‌బీ ఉషా ముళ్లపూడి కమాన్ వరకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రూట్లో నిత్యం వేల సంఖ్యలో వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో కొందరు నిర్లక్ష్యంగా, వేగంగా డ్రైవింగ్ చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఎల్లమ్మ బండ మొదలుకుని తులసీ వనం వరకు స్పీడ్ బ్రేకర్లు లేకపోవడమేనని స్థానికులు చెప్తున్నారు. గతంలో ఈ దారిలో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను కొందరు తొలగించారని, అవి ఉండి ఉంటే ప్రమాదాలు పెద్దగా జరగపోయేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గుడ్ విల్ హౌటల్ వద్ద నుంచి అతి వేగంతో వచ్చే ద్విచక్ర వాహనాలు, కార్లు గోదా కృష్ణ ఫంక్షన్‌హాల్ దాటగానే వచ్చే సర్కిల్‌వద్ద ప్రమాదాలకు గురవుతుండటం పరిపాటిగా మారుతోందని స్థానికుడు రవి తెలిపాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు.