Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సర్ రొనాల్డ్ రాస్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఓయూ విద్యార్థులు, అధ్యాపకుల ఆధ్వర్యంలో బేగంపేటలోని సర్ రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారసిటాలొజిలో ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఓయూ ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, సంస్థ డైరెక్టర్ ప్రొ.ఎస్ జితేందర్ కుమార్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ రొనాల్డ్ రాస్ జీవితం విద్యార్థులు, పరిశోధకులకు ఆదర్శమన్నారు. మలేరియా పారసైట్ జీవిత చక్రానికి సంబంధించిన పరిశోధనకుగాను ఆయనకు1902లో నోబెల్ బహుమతి దక్కిందని గుర్తు చేశారు. 1897లోనే ఒక దోమ జీర్ణాశయాంతర ప్రేగులలో మలేరియా పరాన్న జీవిని కనుగొనటం వల్లనే మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని రుజువైందని వివరించారు. మలేరియా వ్యాధిని ఎదుర్కొనే పద్దతికి పునాదులు వేయటంతో పాటు హైదరాబాద్ నగరంలో ఆయనకున్న అనుబంధాన్ని సైతం గుర్తు చేశారు. ఆయన సేవలకు గుర్తుగానే నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి సర్ రొనాల్డ్ రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్, కమ్యూనికబుల్ డిసీజెస్ అని పేరు పెట్టారని ప్రొ. జితెందర్ కుమార్ చెప్పారు. 2022 -2023 విద్యాసంవత్సరానికి గాను డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్ కోర్సు కూడా ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఓయూ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ ప్రొ. మాధవి, ప్రొ. ఏఈ రాజా శేఖర్ పాల్గొన్నారు.