Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యాధునిక పద్ధతిలో గుండెకు సర్జరీ నిర్వహించి, పేషెంట్ ప్రాణాలు
- కాపాడిన యశోదా హాస్పిటల్స్ డాక్లర్లు
నవతెలంగాణ-హైదరాబాద్
మన శరీరంలో గుండె చాలా ప్రధాన అవయవం. ఇది పూర్తిగా కండరాలతో నిర్మితమైనది. నిరంతరాయంగా మనిషి జీవించినంతకాలం గుండె పనిచేస్తూనే ఉండాలి. మన జీవితకాలంలో గుండె మొత్తం 8 లక్షలకు పైగా లీటర్ల రక్తాన్ని శరీరంలోని అన్ని ప్రధాన భాగాలకు పంప్ చేస్తుంది. గుండె నుండి అవయవాలన్నింటికీ రక్తన్ని చేర్చే బాధ్యతను శరీరంలో అతిపెద్దది అయిన బృహద్దమని (అయోర్టా) నిర్వహిస్తుంది. ఈ దృఢమైన, శక్తివంతమైన భారీ దమని అసాధారణమైన పని ఒత్తిడిని తట్టుకొని, గుండె నుండి శుద్ధిచేసిన రక్తాన్ని తలపై భాగం మొదలుకొని అరికాళ్ల వరకూ ప్రతి భాగానికీ చేరేటట్లు చూస్తుంది. ఈ అయోర్టా వాల్వ్‌తో పాటు గుండెలో 4 కవాటాలు (వాల్వ్) ఉంటాయి. ''రక్త ప్రసరణ సరఫరా వ్యవస్థ'' కు ఇవి చాలా కీలకం. ఇంతటి ప్రధానమైన బృహద్ధమని లోపలి, మధ్య పొరలు చీలిపోవడం అనే అరుదైన సమస్యతో ప్రాణాపాయ స్థితిలోకి చేరిన సిద్దిపేట జిల్లాకు చెందిన కనకయ్యకు సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన సందర్బంగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్. జి. రమేశ్ తన అనుభవాలను మీడియాకు వెల్లడించారు.
సిద్దిపేట జిల్లా, నంగనూర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడైన 53 సంవత్సరాల కనకయ్య, గతనెల ఒక అరుదైన గుండె సమస్యతో ప్రాణాపాయ స్థితిలో మా దగ్గరకు వచ్చారు. అతనికి చాలా అరుదుగా వచ్చే గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్లే అయోర్టా (బృహద్దమని విచ్ఛిన్నం) బృహద్దమని లోపలి, మధ్య పొరలు చీలిపోవడం అనే ఒక అరుదైన గుండె సమస్యతో అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చాడు. కనకయ్యను అత్యాధునిక ''క్యాథ్ ల్యాబ్'' కు తరలించి, వివిధ టెస్టులు నిర్వహించి అతను అయోర్టా (బృహద్దమని విచ్ఛిన్నం)తో బాధపడుతున్నట్లు గుర్తించాం. దీనికి ''బెంటాల్ ప్రక్రియ'' అనే అత్యాధునిక సర్జరీనే సరైన పరిష్కారమని కనకయ్య కుటుంబ సభ్యులకు వివరించాం. వారి ఆమోదంతో పేషెంట్‌కు సర్జరీ ప్రారంభించాం. బెంటాల్ ప్రక్రియ అనేది బృహద్దమని కవాటం, బృహద్ధమని రూట్, ఆరోహణ బృహద్దమని మిశ్రమ గ్రాఫ్ట్ రీ ప్లేస్‌మెంట్‌తో కూడిన ఒక రకమైన కార్డియాక్ సర్జరీ. ఇది కరోనరీ ఆర్టరీలను గ్రాఫ్ట్లోకి తిరిగి అమర్చడం అన్నమాట. డాక్టర్ పి.వి. నరేష్ కుమార్ అండ్ కార్డియాలజీ బృందంతో కలిసి కనకయ్యకు సర్జరీ చేసి, గుండె బృహద్దమని కవాటం, గ్రాఫ్ట్ విజయవంతంగా రీ ప్లేస్మెంట్ చేశాం. సర్జరీ తరువాత కనకయ్య చాలా తక్కువ టైంలో కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు.