Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
ప్రతియేటా మే 17న వరల్డ్ హైపర్టెన్షన్ డే నిర్వహిస్తారు. ఈ సంవత్సరం థీమ్ 'మీ రక్తపోటు కచ్చితంగా తెలుసుకోండి, నియంత్రించండి, దీర్ఘకాలం జీవించండి' అనే నినాదంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లిలోని ఎస్ఎల్జీ ఆస్పత్రిలో సోమవారం హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భానుకిరణ్ రెడ్డి అధిక రక్తపోటు గురించి పూర్తి వివరాలు తెలియజేశారు. 'ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 30% మందికి అధిక రక్తపోటు ఉంటోంది. ప్రపంచంలో సుమారు వంద కోట్ల మంది దీంతో బాధపడుతున్నారు. ఇది ముందస్తు మరణాలకు ఒక ప్రధాన కారణం. ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అభివర్ణిస్తారు. అధిక రక్తపోటు వల్ల ప్రధానంగా గుండెకవాటాల వ్యాధులు, స్ట్రోక్, దీర్ఘకాల కిడ్నీవ్యాధి, గుండె వైఫల్యం, గుండె లయతప్పడం, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారిలో దాదాపు సగం మందికి అది ఉన్న విషయం తెలియదు. దాంతో వాళ్లు నివారించదగ్గ వ్యాధుల బారిన పడి మరణించే ప్రమాదం ఉంటుంది. 18 ఏండ్లు దాటినవారు ప్రతి ఒక్కరూ కనీసం రెండేండ్లకోసారి, 40 ఏండ్లు దాటినవారైతే ప్రతియేటా తప్పనిసరిగా రక్తపోటు పరీక్ష చేయించుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, తగిన మందులు తీసుకోవడం ద్వారా దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలు, త్వరగా మరణించే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు' అని ఆయన వివరించారు. ప్రపంచ హైపర్టెన్షన్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ బీపీ పరీక్ష చేయించుకుని, తగిన విధంగా చికిత్స పొందాలని ఎస్ఎల్జీ ఆస్పత్రి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హరిరామ్ సూచించారు. కార్యక్రమంలో కన్సల్టెంట్ కార్డియాలజిస్టులు డాక్టర్ భాస్కర్ త్రిపాఠి, డాక్టర్ వికాస్ కుమార్ పాల్గొన్నారు.