Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
దళిత బంధు పథకంలో ఎస్సీ ఉప కులాలకు జనాభా దామాషా ప్రకారం 40 శాతం కేటాయించాలని ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పర్క్ ధర్నా చౌక్ వద్ద 57 ఎస్సీ ఉపకులాలు సమస్యల సాధనకై నిరసన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మోచి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేష్, హోలీయ దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆదిముల వెంకటేష్ హాజరై మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఈ నాటికి కూడా మోచి, హోలీయ దాసరి, బైండ్ల, చిదోళ్లు, మస్తిన్స్, గోసంగి డక్కలి తదితర 57 కులాల దళితులకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అభివద్ధి ఫలాలు అందక కులవత్తులను కోల్పోయి ఉపాధి కరువై దుర్భర పరిస్థితుల్లో సంచార జీవనం గడుపుతున్నారు అని తెలిపారు. దళిత బంధు పథకంలో ఎస్సీ ఉప కులాలకు జనాభా దామాషా ప్రకారం 40 శాతం కేటాయించాలన్నారు. ఎస్సీ ఉప కులాలను అత్యంత వెనుకబడిన షెడ్యూల్ కులాలుగా గుర్తించి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండు వేల కోట్ల నిధులు కేటాయించాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీ అధికారం ఆర్టీవో పరిధిలో నుంచి తొలగించి తహసీల్దార్ ద్వారా ఇవ్వాలన్నారు. నిరసన దీక్షలో మోచి సంఘం అధ్యక్షులు రాచర్ల రాజు దశరథ్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, హోలీయ దాసరి సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు శాఖమూరి యాదగిరి, బైండ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏదుల గౌరీశంకర్, ప్రధాన కార్యదర్శి ఏర్పుల భాస్కర్, గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుచ్చన్న, సాయి చరణ్, చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయి లక్ష్మి నరసయ్య, ప్రధాన కార్యదర్శి గడ్డం రమేష్, డక్కలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్నె రామారావు, అల్లం రాజమౌళి తదితర కుల సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు.