Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధం నిర్వీర్యం
- మాటలకే పరిమితమవుతున్న పర్యావరణ పరిరక్షణ
- నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్న జీహెచ్ఎంసీ అధికారులు
నవతెలంగాణ - బాలానగర్
పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుభూతంగా మారింది. ప్లాస్టిక్ కవర్లు మొదలు వాటితో చేసిన వస్తువుల విక్రయాలు, వినియోగానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పాలు, పెరుగు, కూరగాయలు, టిఫిన్, భోజనం.. ఏది తేవాలన్నా నేడు ప్లాస్టిక్ కవర్ల వాడకం తప్పనిసరిగా మారింది. అయితే తరచూ ప్లాస్టిక్ వాడకం ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ముప్పుగా మారుతోందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించినా, అసలూ మూలాలపై దృష్టి పెట్టకపోవడం, ఉత్పాకదక కంపెనీలపై చర్యలు తీసుకోకపోవడంతోనే ప్లాస్టిక్ వాడకం పెరుగుదలకు కారణం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ప్లాస్టిక్ వ్యాపారులు రూ.కోట్ల దందాను కొనసాగిస్తున్నారు. దీన్ని అదుపుచేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోవడంలేదు. ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పెనుప్రమాదం పొంచి ఉన్న విషయం 1930 లోనే గుర్తించారు. ఒక ప్లాస్టిక్ వస్తువు మట్టిలో పూర్తిగా కలసిపోవటానకి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు 1999లో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిషేధిత చట్టం ఉత్తర్వులు జారీచేసింది. కానీ అమలు మాత్రం సక్రమంగా లేదని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలతో జరిగే నష్టాలు
ప్లాస్టిక్‌ను తగలబెడితే దాని నుంచి వెలువడే డ్రైయాక్సిన్ వాయువు గాలిలో కలిసి క్యాన్సర్ వ్యాధికి కారణమవుతుంది. ప్రజారోగ్యంపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. పశుగ్రాసం లేనప్పుడు పశువులు, వివిధ జీవాలు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటాయి. వాటి మాంసం మనం తినటం వల్ల పలు రోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ వాడి ఎక్కడపడితే అక్కడ పడేయడం. చెత్తకుండి, నాలాలు సైతం పాలిథీన్ కవర్లతో నిండిపోతున్నాయి. ఫలితంగా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. వాటిని పశువులు తినడంవల్ల వాటికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పాలు కలుషితమౌతాయి. పాలిథిన్ కవర్లు భూమిలో కలిసిపోవడానికి కొన్ని లక్షల సంత్సరాలు పడుతుంది. పైగా ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ కూడా వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఎదుగుదల, జ్ఞాపక శక్తి హరించుకపోవడంతో పాటు కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. అది మాటే. తర్వాత షరా మామూలే. ప్రత్యామ్నాయంగా కాగితపు కవర్లు, వెదురు బుట్టలు, బట్ట సంచుల వంటి ప్రకృతి సహజమైన వాటినే వాడడం మంచిది. ప్లాస్టిక్‌ను కాల్చివేయటం ద్వారా డ్రైయాక్సిన్ వాయువు గాలిలో కలిసి క్యాన్సర్ కారణమవుతుంది. పశుగ్రాసం లేనప్పుడు పశువులు, వివిధ జీవాలు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటాయి. వాటి మాంసం మనం తినటం వల్ల పలు రోగాలు వచ్చే అవకాశం ఉంది. చెరువుల్లో, నదుల్లో ఈ వ్యర్థాలు వేయటంవల్ల చేపలు ఇతర జలచరాలు చనిపోతాయి.
నియోజవర్గంలో పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకం
బాలానగర్ పరిధిలోని కూరగాయల మార్కెట్లలో, మాంసపు దుకాణాలలో దేవాలయాలకు తీసుకెళ్లే పూలు, కొబ్బరికాయలు ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకెళ్తుంటారు. ఆలయంలో ఇచ్చే ప్రసాదాలు ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకెళుతున్నారు. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను ఆలయ ఆవరణలోనే పడేస్తుంటారు. పారిశ్రామిక వాడల్లో ప్రముఖ ఫార్మా కంపెనీలు సైతం ప్లాస్టిక్ వినియోగిస్తున్నాయి. వాడిన అనం తరం నాలాలో, కాలువల్లో వేయడం ద్వారా అపరిశుభ్ర వాతావరణానికి కారణం అవుతోంది. ప్రభుత్వ అధికారులు ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తే ప్రజల్లో చైతన్యం వచ్చి , వాడకాన్ని తగ్గించుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలి
కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని బాలానగర్, ఫతేనగర్ డివిజన్లో పాలిథిన్ కవర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అధికారులు తనిఖీలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రకృతి వినాశనానికి కారణమవుతున్న పాలిథిన్ కవర్ల వాడకం పెరిగిపో వడంతో భూగర్భ జలం దెబ్బతింటుంది. జీహెచ్ ఎంసీ అధికారులు కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలలో రెగ్యులర్ తనిఖీలు చేయాలి ప్రభుత్వం చెప్పినట్టు మైక్రో టన్నుల లక్కవరం వాడాలి. జీమెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ డిపార్టుమెంట్ అధికారులు, గోనె సంచుల వాడకాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలి. ప్రజా ప్రతినిధులు కూడా ప్రచారం చేయాలని పలువురు పేర్కొంటున్నారు. భవిష్యత్తు తరానికి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలి. భూగర్భ జలాలు దెబ్బతీసే పాలిథిన్ కవర్లను నిషేధిద్దాం, గోనె సంచుల వాడకాన్ని పెంచుకుందాం.
ఐలాపురం రాజశేఖర్
(సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
ప్రజలు నియంత్రణలో భాగస్వామ్యం కావాలి
డివిజన్ల పరిధిలో పాలిథిన్ కవర్లు విక్రయిం చినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుం టాం. ప్రభుత్వ నిషేధిత పాలిథిన్ కవర్ల వల్ల పర్యావరణానికే కాకుండా పారిశుధ్యానికి తీవ్ర ముప్పు, నాసిరకం, ప్రమాదకరమైన కవర్ల వినియోగం విషయంలో ప్రభుత్వ యంత్రా గానికే కాదు సామాన్య ప్రజలు సైతం బాధ్యత వహించాలి. పర్యావరణం గతితప్పితే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో కరోనా తెలియజెప్పింది. ఈ అనుభవంతోనైనా ప్రజలు నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగం ద్వారా మరో ప్రమాదాన్ని తెచ్చుకోకుండా జాగ్రత్తపడాలి. డివిజన్ల పరిధిలో ఎక్కడైనా పాలిథిన్ వినియోగంలో ఉన్నట్లుగా తెలిస్తే సమాచారం అందించండి. పాలిథిన్ వాడే వారికి అధిక మొత్తంలో జరిమానాలు విధించడంతో పాటు కోర్టులో కేసులు నమోదు చేస్తామన్నారు. కె.రవికుమార్
(మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్)