Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధుల కొరతతో దరఖాస్తులు పెండింగ్
- నిలిచిన రూ.158.76 కోట్ల ఆర్థిక సాయం
- కార్యాలయాల చుట్టూ లబ్దిదారుల ప్రదక్షిణలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడింది. బడ్జెట్లో కేటాయింపులు ఘనంగా చూపినప్పటికీ వాటి మంజూరు, విడుదలలో మాత్రం తీవ్ర జాప్యం కనబడుతోంది. ప్రభుత్వ ఆర్థికసాయం అందుతుందన్న గంపెడాశతో పేద, మధ్య తరగతివారు అప్పోసప్పో చేసి ఆడబిడ్డల పెండ్లిండ్లు చేసేస్తున్నారు. తీరా ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయస్త్రం నెలలు గడుస్తున్నా చేతికి అందక పోవడంతో నిరాశకు గురవుతున్నారు. రెవెన్యూ శాఖలో ఒకవైపు దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా పెండింగ్‌లో ఉండిపోతుండగా.. మరోవైపు తహసీల్దారు పరిశీలన పూర్తయి ఎమ్మెల్యే, ఆర్డీవో ఆమోదం పొంది మంజూరు కోసం ట్రెజరీలకు బిల్లులు వెళ్తున్నా సంబంధిత ఆర్థిక సాయం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు. పెండ్లిండ్లు జరిగి పిల్లలు పుట్టినా కల్యాణ లక్ష్మి ఆర్థిక సాయం అందనివారు ఉన్నారు. తమకు రావాల్సిన డబ్బుల కోసం బాధిత కుటుంబ సభ్యులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు.
భారీగా దరఖాస్తులు..
జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్లు ఉండగా.. మొత్తం 16 మండలాల నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు పథకాలకు కలిపి జిల్లావ్యాప్తంగా మొత్తం 15,858 దరఖాస్తులు వచ్చాయి. అందులో కల్యాణలక్ష్మి కింద 1731 దరఖాస్తులు రాగా.. ఇందులో తహసీల్దార్లు 1082 దరఖాస్తులను పరిశీలించగా.. ఇంకా 649 పెండింగ్‌లో ఉన్నాయి. తహసీల్దార్లు పరిశీలించి ఎమ్మెల్యేల వద్దకు పంపించిన వాటిలో 290 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎనిమిది దరఖాస్తులు తహీసీల్దార్ స్థాయిలో రిజెక్ట్ అయ్యాయి. ఎమ్మెల్యేల ద్వారా ఆమోదం పొందిన 784 దరఖాస్తులకు బిల్లులు సాంక్షన్ కావాల్సి ఉంది. షాదీముబారక్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ పథకానికి 14,127 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 12979 తహసీల్దార్లు పరిశీలించగా.. 1148 పరిశీలనలో ఉన్నాయి. ఎమ్మెల్యేల వద్ద 654 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 53 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. 12107 దరఖాస్తులు ఎమ్మెల్యేలు ఆమోదించగా.. బిల్లులు సాంక్షన్ కావాల్సి ఉన్నాయి. ఇక 165 దరఖాస్తులు సాంక్షన్ అయి బిల్లులు అప్లోడ్ చేయాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు కలిపి వచ్చిన మొత్తం 15,858 దరఖాస్తులకుగాను 158.76 కోట్లు అవసరం కాగా ఇందులో అప్రూవల్ అయిన 12,891 దరఖాస్తులకు సుమారు రూ.129.05కోట్లు నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇందులో కలాణలక్ష్మికి గతేడాది మార్చిలో విడుదలైన నిధులను కొంతవరకు లబ్దిదారులకు అందజేయగా.. షాదీముబాకర్కు గతేడాది నవంబర్ నెలలో మాత్రమే బడ్జెట్ విడుదలైంది. ఆర్థిక సంవత్సరం ముగింపులో ఎలాంటి నిధులూ రిలీజ్ కాలేదు. దీంతో భారీగా దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోయాయి. ఇక ఇటీవల రెండు ఆర్డీవోల పరిధిలో కొంతమేర నిధులు విడుదలయ్యాయనీ, త్వరలోనే లబ్దిదారులకు చెక్కులు అందనున్నాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.