Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు : ఎండీ దానకిశోర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
విధుల్లో కార్మికులు, సిబ్బంది తీసుకోవాల్సిన రక్షణా చర్యలపై, మ్యాన్హౌళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం కోసం భద్రతా వారోత్సవాలను చేపట్టామని వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్ తెలిపారు. బుధవారం నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని జలమండలి డివిజన్లలో భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. పనులు చేస్తున్నప్పుడు రక్షణ పరికరాలను కచ్చితంగా ఉపయోగిస్తామని కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ.. సీవరేజి కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్రతపై మే 25 నుంచి జూన్ 1 వరకు వారం రోజులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మురుగునీటి నిర్వహణలో చేయాల్సిన, చేయకూడని పనులు, భద్రతా పరికరాలు ఉపయోగించాల్సిన సరైన విధానం, వాటివల్ల ఉండే లాభాలు, పారిశుధ్య పనులు చేపట్టే సమయంలో అవలంభించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. జలమండలి ప్రతీయేటా ఈ భద్రతా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. మానవ రహిత పారిశుధ్య పనుల కోసం మినీ ఎయిర్ టెక్ మెషిన్లను జలమండలి ఉపయోగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మ్యాన్ హౌళ్లను యంత్రాల సహాయంతో శుభ్రపరచడానికి సివర్ క్రాక్ లాంటి పరికరాలను రూపొందించిందని తెలిపారు. దీనివల్ల మ్యాన్ హౌళ్ళ క్లీనింగ్‌లో మానవ ప్రమేయం లేకుండా చేశామన్నారు. పారిశుధ్య పనుల్లో ఎస్వోపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) గైడ్ లైన్స్ అమలుపై, భద్రతా పరికరాల పనితీరు, వాటిని ఉపయోగించే విధానం, మ్యాన్ హౌళ్లను శుద్ధి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం సంభవించినపుడు చేసే ప్రథమ చికిత్స వంటి అంశాలపై కార్మికులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. కార్మికులు విధి నిర్వహణలో తప్పకుండా హ్యండ్ గ్లౌజులు, గమ్ బూట్స్, మాస్కులు, బాడీ సూట్ వంటి భద్రతా పరికరాలను ధరించేలాగా ప్రతీ మేనేజర్ తమ సెక్షన్ పరిధిలోని సీవరేజి కార్మికులందరికీ అవగాహన కల్పించాలని ఎండీ దానకిశోర్ ఆదేశించారు. నగరంలో మూడున్నర లక్షల మ్యాన్హౌళ్లు ఉన్నాయని, వీటి మూతలను నగర వాసులు తెరవొద్దని కోరారు. షాంపూ ప్యాకెట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార పదార్థాల వ్యర్థాలు, బట్టలు, దిండ్లు, పరుపులు, పాలిథిన్ కవర్లు, సీసాలు, గాజు ముక్కలు, రాళ్లు, ఇటుకలు వంటి వ్యర్థాలను మ్యాన్ హౌళ్లలో వేయొద్దని కోరారు. అపార్టుమెంట్ వాసులు, వాణిజ్య భవనాలలో సిల్ట్ ఛాంబర్లు తప్పనిసరిగా నిర్మించుకోవాలని ఆయన కోరారు. మనుషులను మ్యాన్హౌళ్లలోకి దించవద్దని, ఇది చట్టరీత్యా నేరమని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా జలమండలి కస్టమర్ కేర్ నెంబరు 155313కి ఫోన్ చేస్తే పరిష్కరిస్తామని చెప్పారు.