Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల జాన్
నవతెలంగాణ-బాలానగర్
కార్పొరేట్ కళాశాలలు, ప్రైవేట్ స్కూల్స్ అడ్డగోలు అడ్మిషన్లకు తెరలేపాయని, పదవ తరగతి పరీక్షలు పూర్తి కాకముందే ముందస్తు ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారని ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల జాన్ ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియక ముందే కార్పొరేట్ కళాశాల, ప్క్రెవేటు స్కూళ్ల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు ముందే మొదలుపెట్టాయని, ముందుగా అడ్మిషన్లు చేసుకుంటే రాయితీ ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రులను ఆశపెడుతు మభ్యపెడుతున్నారని అన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్లో నిర్ణీత ఫీజుల బోర్డులు ఏర్పాటు చేసి విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాలి, కాగా నగరంలోని కొన్ని స్కూళ్లు, కళాశాలలు చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రీతిలో వ్యవహరిస్తున్నాయి. బ్రాండ్ పేరు చెప్పుకుని అడ్డగోలుగా ఫీజులు దండుకుంటున్నాయని, ఇస్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ, నిలువు దోపిడీ చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడమే లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.